జగన్ కంటే చంద్రబాబే శక్తివంతుడు అంటున్న వైసీపీ నేతలు!
ఎవరైనా సొంత పార్టీ నాయకుడిని పొగుడుతారు. ఇది సహజం. కానీ వైసీపీ నేతలు ఏంటో ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు..22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబే శక్తివంతుడు అంటున్నారు. ఒకసారి కాదు..పదే పదే ఈ మాట చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలే కాదు..చివరకు మంత్రులు కూడా ఇదే మాట మాట్లాడుతుండటంతో ఈ వ్యవహారం చూస్తున్న అధికారులకు ఇదెక్కడి గొడవ అంటూ అవాక్కు అవుతున్నారు. ఇది అంతా ప్రత్యేక హోదా వ్యవహారంతో వెరైటీ వ్యవహారం. తాజాగా కేంద్ర హోం శాఖ విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణలకు సంబంధించి ఓ ఏజెండాను తయారు చేసింది.అందులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చించింది. దీంతో వైసీపీ నేతలు ఇంకేంటి సీఎం జగన్ పదే పదే విన్నవించటంతోపాటు..వైసీపీ ఎంపీలు పోరాటం చేయటంతోనే ఇది సాధ్యం అయిందని చెప్పుకున్నారు. నిజంగా ఇప్పుడు కాకపోయినా ఈ రెండేళ్ళలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిన ఈ క్రెడిట్ జగన్ ఖాతాలోనే పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ కేంద్ర హోం శాఖ ఏజెండా సిద్ధం చేయగానే వైసీపీ పార్లమెంటర్టీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇన్ స్టా హ్యాండిల్ లో ఓ వైపు దివంగత వైఎస్, మరో వైఎస్ వైఎస్ జగన్, కింద తన ఫోటో పెట్టుకుని కేంద్ర హోం శాఖ ప్రత్యేక హోదా అంశాన్ని తన చర్చల ఏజెండాలో చేర్చిందని ..ఇందుకు కారణం పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల పోరాటం, ప్రధానికి పలుమార్లు సీఎం జగన్ విన్నవించటమే అని రాసుకున్నారు. ఈ వార్త ప్రచురించే సమయానికి కూడా ఇన్ స్టాలో ఈ పోస్టు ఉంది. ఓ వైపు ఏజండాలో చేర్చటం వెనక అంతా తమ సత్తానే అని బహిరంగంగా చెప్పుకున్న వైసీపీ నేతలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా అంశాన్ని జాబితా నుంచి తొలగించారో ఆ వెంటనే చంద్రబాబుపై ఎటాక్ ప్రారంభించారు. మరి వైసీపీ ఎంపీల పోరాటం, జగన్ విన్నపాలు అకస్మాత్తుగా ఏమైపోయినట్లు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు చంద్రబాబు మాటకే...ఆయన రాయభారం పంపిన వారి మాటకే విలువ ఇచ్చి ఈ అంశాన్ని ఏజెండా నుంచి తొలగించారా?. వైసీపీ నేతలు అంబటి రాంబాబు దగ్గర నుంచి మంత్రులు కూడా ఇదే మాట చెబుతున్నారు. పైగా ప్రత్యేక హోదా అంశం ఏజెండాలో రాగానే చంద్రబాబు స్వాగతించలేదు అట..దీంతో ఆయన కుట్రపన్ని తీయించారంట.
నిజంగా ప్రత్యేక హోదా వచ్చి ఉంటే చంద్రబాబు దానిపై మాట్లాడకపోతే అప్పుడు ఖచ్చితంగా అది అభ్యంతకరమే అవుతుంది. కానీ కేవలం ఏజెండాలో పెట్టగానే చంద్రబాబు బయటకు వచ్చి స్వాగతం చెప్పాలంట. ఇదీ వైసీపీ నేతల విచిత్ర వాదన. స్వాగతించలేదు కాబట్టి ఆయనే తీయించారని..ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అంబటి రాంబాబు చెబుతారు. సోమవారం నాడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్వయంగా చంద్రబాబు కుట్ర కారణంగానే ప్రత్యేక హోదా అంశం ఏజెండా నుంచి తొలగించారని ఆరోపించారు. వాస్తవానికి బిజెపికి త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలతోపాటు ఇతర అంశాల విషయంలో అవసరం అయితే జగన్ మద్దతు అవసరం అవుతుంది. అలాంటి సమయంలో కూడా బిజెపి జగన్ ను కాదని..చంద్రబాబు మాటలు విని ప్రత్యేక హోదా అంశాన్ని చర్చల ఏజెండా నుంచి తొలగించింది అంటూ మంత్రులు..అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయటం ఏమిటో అర్ధం కావటంలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. వారు తమ వ్యాఖ్యల ద్వారా పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను వాళ్లకు వాళ్లే తగ్గించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.