తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఎన్నికను రద్దు చేయాలి
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా దొంగ ఓట్లు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోలింగ్ రద్దు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ''తిరుపతిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. స్థానికేతరులు వేలసంఖ్యలో దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓట్ల నియంత్రణలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి'' అని సీఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే వీడియో, ఫొటో ఆధారాలను సీఈసీ లేఖకు జత చేసి పంపారు. వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే.. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు. ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారని ఆరోపించారు.