Telugu Gateway
Politics

ఏపీ డీజీపీని రీకాల్ చేయాలి

ఏపీ డీజీపీని రీకాల్ చేయాలి
X

పార్టీ ఆఫీసుల‌పై దాడిని సీబీఐతో విచార‌ణ చేయించాలి

ఏపీలో తిట్లు..దాడుల వ్య‌వ‌హారం ఢిల్లీకి చేరింది. గ‌త కొన్ని రోజులుగా ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత దారుణంగా మారిన విష‌యం తెలిసిందే. టీడీపీ నేత‌లు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని..వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌తో ఈ వ్య‌వ‌హారం కాస్తా రాజ‌కీయంగా ర‌చ్చ‌కు దారితీసింది. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ ను క‌ల‌సి ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామన్నారు.

రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ, పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరని మండిపడ్డారు. ఘటనాస్థలికి తాను వెళ్లేసరికి దాడి చేసినవారిని పోలీసులే పంపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఏపీలో మూలాలున్నాయని ఆరోపించారు. ఏపీలో 23వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సహజవనరులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలేదన్నారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. తమపై దాడులు చేసి.. తిరిగి త‌మ‌పైనే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు విమ‌ర్శించారు.

Next Story
Share it