'వర్కవుట్' కాని చంద్రబాబు ఢిల్లీ ప్లాన్!
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాటే. కాకపోతే ఈ మధ్య అవి మరింత ఘాటుగా మారాయి. బూతులు తిట్టారని ఒకరు...దాడులు చేశారని మరొకరు. అయితే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా వాడుకుందామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇచ్చినట్లు లేవు. అందరినీ కలసి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేద్దామని తెలుగుదేశం పార్టీ భారీ ప్రణాళిక వేసుకుంది. ముఖ్యంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అయితే వినతిపత్రం అందజేసి..ఆయన ముందు పలు డిమాండ్లు పెట్టారు. దీని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలిసిందే. రాజకీయ విమర్శల పరంగా ఎలా ఉన్నా..ప్రస్తుతానికి ఢిల్లీలోని మోడీ సర్కారుకు. ఏపీ సర్కారుకు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను పక్కన పెట్టి చంద్రబాబును బిజెపి దగ్గరకు తీసుకునే అవకాశం ప్రస్తుతానికి అయితే కన్పించటం లేదు. దీని వెనక పలు అంశాలు, కారణాలు ఉన్నాయి. అదే చంద్రబాబుతో బిజెపికి చాలా చేదు అనుభవాలే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దశలో మోడీ, అమిత్ షాలు వాటిని అంత తొందరగా మర్చిపోతారు అనుకోవటం భ్రమే అవుతుంది. అయితే రాజకీయాల్లో జరిగే పరిణామాలు అన్నీ అవసరాలకు అనుగుణంగానే తప్ప మరొకటి కాదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల పార్టీ ఆఫీసులపై దాడిని ప్రభుత్వ ఉగ్రవాదంతో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఏపీ డ్రగ్స్, గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.