బిజెపి అప్పులు చేయటం లేదా?

అమరరాజాతో కాలుష్యం..ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
సజ్జల రామకృష్ణారెడ్డి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అప్పులు చేయటం లేదా? అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బిజెపి అప్పులు చేస్తే ఒప్పు..మేం చేస్తే తప్పా అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు తోడు కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు. కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్ ,డీజిల్ చార్జీలతోపాటు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచారన్నారు. 'బాబు హయాంలో ధరలు పెరిగినప్పుడు ఎల్లో మీడియా ఏం చేసింది? బాబు హయాంలో రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. బాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ఈ పరిస్థితి.
రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదు' అన్నారు. అమర్‌రాజా కంపెనీ వ్యవహారంపైనా ఆయన స్పందించారు. 'అమర్‌రాజా కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. అమర్‌రాజా వ్యవహారంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశం. ప్రజలకు ఇబ్బంది కలిగించే అన్ని పరిశ్రమలపై చర్యలు ఉంటాయి'. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి రూపాయి దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు.