Telugu Gateway
Politics

రిగ్గింగ్ కూడా నవరత్నాల్లో భాగమేనా?

రిగ్గింగ్ కూడా నవరత్నాల్లో భాగమేనా?
X

జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నిక రద్దుకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్ ఐ.డి.కార్డులు ముద్రించి ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తోలుకువచ్చి క్యూలో నిలబెడితే – ఓటరుని మీ తండ్రి పేరు ఏమిటని అడిగితే చెప్పలేకపోయారు. ఓ మహిళను నీ భర్త పేరు ఏమిటని అడిగితే తడబడ్డారు. తండ్రి, భర్త ఎవరో తెలియని దుస్థితికి కూలికి వచ్చిన దొంగ ఓటర్లకు కల్పించారు ఈ వైసీపీ నేతలు. ఇలా దొంగ ఓట్లు వేయించడం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవరత్నాల్లో భాగం అనుకోవాలా? ఎన్నికల ముందు దేశం అంతా తలతిప్పి చూసేలా చేస్తాం అన్నారు... అంటే ఈ విధమైన దౌర్జన్యం గురించేనా మీరు చెప్పింది? ఓటమి భయంతోనే ముందు నుంచి నేరపూరిత, ఫ్యాక్షన్ ఆలోచనలతో దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం చేపట్టారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికను తక్షణం రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారి నుంచి పోలింగ్ సిబ్బంది వరకూ అందరినీ దూరంపెట్టి పారదర్శకంగా రీ పోలింగ్ నిర్వహించాలి. వందల బస్సుల్లో రిగ్గింగ్ చేసేందుకు జనాన్ని తరలించడంలోను, దొంగ ఓట్లు పోలయ్యేందుకు సహకరించిన సిబ్బందిపైనా, ఎన్నికల అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.

దొంగ ఓట్లు వేసినవారిని, వేసేందుకు ప్రయత్నించినవారిని వీడియోల ద్వారా గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి. తిరుపతి పోలింగ్ ఎంత దౌర్జన్యపూరితంగా, అప్రజాస్వామిక రీతిలో సాగిందో కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీతో కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఆర్గనైజ్డ్ రిగ్గింగ్ గురించిమీడియా చూపిస్తున్నా రాష్ట్ర ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు కళ్లున్న గుడ్డివారిలా నటిస్తే ప్రజాస్వామ్యం మనజాలదు. ఈ తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఇన్నేళ్లల్లో ఇంతటి అవకతవకలతో కూడిన దౌర్జన్యపూరితమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదన్నారు.

Next Story
Share it