దేవుడు...దెయ్యాలు లింక్ కుదరటం లేదే!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవితే హాట్ టాపిక్. ఎప్పుడో మే 2 న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు వాస్తవాలే. స్వయంగా బిఆర్ఎస్ నాయకులు అనధికారికంగా అంగీకరించేవే. కెసిఆర్ కేవలం కొంత మందికే యాక్సెస్ ఇస్తారు అన్నది అధికారంలో ఉన్నప్పటి నుంచే కాదు..బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న విమర్శ. ఆయనకు అవసరం ఉంటే ఎవరినైనా..ఎంత సేపు అయినా కలుస్తారు. అవసరం లేకపోతే కనీసం గేట్ కూడా తొక్కనీయరు అనే విషయం బిఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత బయటకు వచ్చిన లేఖ తనదే అని ధ్రువీకరించారు. అయితే ఆమె చెప్పిన పలు విషయాల్లో కాంట్రడిక్షన్స్ పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది.
ఒక వైపు ఆమె కెసిఆర్ ను దేవుడు అంటూ ఆయన పక్కన కొంత మంది దెయ్యాలు ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దేవుడు ఎప్పుడైనా తన పక్కన దెయ్యాలను ఉంచుకుంటాడా?. అది సాధ్యం అయ్యే పనేనా?. ఇది మాత్రం ఎక్కడా సింక్ కాలేదు. పార్టీ లో..కుటుంబంలో ఎక్కడా వివాదాలు..విబేధాలు లేవు అని చెప్పుకొచ్చారు. కాసేపు అదే నిజం అనుకుందాం. మరి ఎయిర్ పోర్ట్ లో ఒక్కటంటే ఒక్క బిఆర్ఎస్ జెండా ఎందుకు లేదు. కెసిఆర్ ఫోటో ఎందుకు లేదు?. కవిత ఆదేశాలు లేకుండా ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కవిత నాయకత్వం కోరుకునే వాళ్ళు సొంతంగా ఆ పని చేయగలరా?.అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందే అన్నది క్లియర్.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఎడా పెడా కాంగ్రెస్ కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు, ఇతర పార్టీ లను నిర్వీర్యం చేసినప్పుడు గుర్తుకురాని 2001 నుంచి ఉన్న ఉద్యమకారులు ఇప్పుడే ఎందుకు కవిత కు గుర్తుకు వచ్చారు. అధికారం పోయినందుకేనా?. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ సామాజిక తెలంగాణా గురించి మాట్లాడని కవిత బిఆర్ఎస్ ఓడి పోయిన తర్వాత అది కూడా ఏడాది గడిచిన తర్వాత ఎలా గుర్తుకు వచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం అసలు కెసిఆర్ మంత్రులు..ఎమ్మెల్యేల ను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు..కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు అనే విషయం ఎన్నో సార్లు మీడియా లో వచ్చినా కూడా అప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇప్పుడే ఆమెలోని ప్రజాస్వామిక వాది ఎలా..ఎందుకు బయకు వచ్చారు. వరంగల్ లో జరిగిన బిఆర్ఎస్ సభలో వేదికపై కేవలం కెసిఆర్,కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉండటంతో పార్టీ ఎటు వైపు వెళుతుందో కవిత కు క్లారిటీ వచ్చేసింది. అదే ఆమెకు ఇప్పుడు నచ్చటం లేదు.
కేటీఆర్ తో పాటు తనకు కూడా బిఆర్ఎస్ కీలక పాత్ర కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ ఛాన్స్ ఉన్నట్లు కనిపించకపోవటంతో సామాజిక తెలంగాణ, వక్ఫ్ బిల్లు, బీసీ లకు 42 శాతం స్లొగన్స్ అందుకున్నారు. అయితే కేటీఆర్, కవిత ల విషయానికి వస్తే కేటీఆర్ ఇప్పటికి అధికారంలో ఉన్నప్పటి కంటే మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బహిరంగ వేదికల పై ఆయన స్పీచ్ చూస్తే కూడా అదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేటీఆర్ తో పోలిస్తే కవిత బయట మాట్లాడే సమయంలో ఎక్కడా ధిక్కార ధోరణి కనిపించదు. అది ఒక్కటే ఆమెకు సానుకూల అంశం. అన్నిటి కంటే ముఖ్యం పదేళ్లలో వందల సార్లు తాను చెప్పిన మాటలనే తానే స్వయంగా..అలవోకగా మార్చేసే కెసిఆర్ దేవుడు ఎలా అవుతారు అన్నదే.



