జాతీయ పార్టీగా మారినా ప్రాంతీయ వాసనలు వదలని బిఆర్ఎస్!
ఓ వైపు బిఆర్ఎస్ అధినేత ,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వెళ్లి అక్కడ సభ పెట్టి తమకు అధికారం ఇస్తే ఇక్కడ కూడా తెలంగాణ మోడల్ పాలన అందిస్తామని ప్రకటించారు. రైతు బందు..దళిత బంధు వంటి పథకాలను తీసుకొస్తామన్నారు. ఒక రాజకీయ పార్టీగా బిఆర్ఎస్ తన వైఖరి, విధానం చెప్పటం తప్పేమి కాదు. కానీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ లో పర్యటించి తమకు రాష్ట్రం లో అధికారం ఇవ్వమని కోరితే మాత్రం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆయన్ను టూరిస్ట్ గా అభివర్ణిస్తారు. మరి తెలంగాణకు అమిత్ షా టూరిస్ట్ అయితే మహారాష్ట్రకు కెసిఆర్ ఏమి అవుతారు? కొద్ది రోజుల క్రితం మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళు గుజరాత్ గులాం లు...కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ గులాములు అంటూ విమర్శించారు. ఇప్పుడు కెసిఆర్ కోరినట్లు మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు అనుకుందాం కాసేపు...వాళ్ళు పార్టీ అధినేత కెసిఆర్ చెప్పినట్లు వింటారా లేక ...పూర్తి నిర్ణయాధికారం మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలకే వదిలేస్తారా?.
మహారాష్ట్ర నేతలు కెసిఆర్ చెప్పినట్లు వింటే వాళ్ళు అంతా తెలంగాణ గులాములు అవుతారా?. లేక పార్టీ ఆదేశాలు పాటించినట్లు అవుతుందా?. ఎక్కడి వరకో ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ఎస్ కు మాజీ ఐపీఎస్ అధికారి తోట చంద్ర శేఖర్ ను ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని, సంఘీభావం ప్రకటించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆయన్ను కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఏమి చేయాలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డైరెక్ట్ చేస్తారు నేరుగా అంటే పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ కి సొంతంగా ఏమి చేసే స్వేచ్ఛ లేదనే సంకేతాలు పంపారు. వాళ్ళు ఏమి చేసిన అంతా ప్రజాస్వామ్యం..ఇతరులు మాత్రం పార్టీ ఆదేశాలు పాటిస్తే గులాములు అంటూ విమర్శలు చేయటం. ఇవి చుసిన వారంతా కూడా జాతీయ పార్టీగా మారినా బిఆర్ఎస్ లో ప్రాంతీయ వాదం పోవటం లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు.