Telugu Gateway
Politics

బీజేపీపై డోస్ తగ్గించి...కాంగ్రెస్ పై పెంచుతున్న కెసిఆర్

బీజేపీపై డోస్ తగ్గించి...కాంగ్రెస్ పై పెంచుతున్న కెసిఆర్
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది రోజుల క్రితం వరకు అసలు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అనే విషయాన్నీ ఏ మాత్రం పట్టించుకోనట్లు వ్యవహరించారు. ఎక్కువ ఫోకస్ బీజేపీ పై పెట్టి తెలంగాణ లో క్షేత్రస్థాయిలో పెద్దగా బలంలేని బీజేపీ ని పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక్క దెబ్బతో ఇప్పుడు కెసిఆర్ పదే పదే కాంగ్రెస్ జపం చేస్తున్నారు. మహారాష్ట్ర వెళ్లి కూడా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ సర్కారు కంటే ఎక్కువ విమర్శలు కాంగ్రెస్ పై చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ఎన్నికలను ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూనే ఇప్పుడు నిత్యం కాంగ్రెస్ పై కెసిఆర్ విమర్శలు చేస్తున్నారు అంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కెసిఆర్ బీజేపీ పై కంటే కాంగ్రెస్ పార్టీ పైనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అంటే తెలంగాణలో బిఆర్ ఎస్ కు ప్రధాన పోటీ ఇచ్చేది ఆ పార్టీ నే కాబట్టి. తెలంగాణ కాంగ్రెస్ లో కర్ణాటక ఫలితాల జోష్ కనిపిస్తుంటే...తెలంగాణ బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది.

ఇతర పార్టీల నుంచి బీజేపీ లో చేరినవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బిఆర్ఎస్ కూడా కర్ణాటక ఫలితాలతో ఉలిక్కిపడినట్లు స్పందించిన విషయం తెలిసిందే. ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాక ముందే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఏమి ఉండదు అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం కెసిఆర్ టార్గెట్ కూడా మారింది అని చెపుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే కెసిఆర్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ని మరింత టార్గెట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు బిఆర్ఎస్ కు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి రావటం తో పాటు పలు వర్గాల్లో సర్కారుపై తీవ్ర అసంతృప్తి ఉంది.

Next Story
Share it