Telugu Gateway
Politics

కెసిఆర్ కల నెరవేరుతుందా?!

కెసిఆర్ కల నెరవేరుతుందా?!
X

దేశానికీ ఇక బిఆర్ఎస్, కెసిఆర్ తప్ప మరో దిక్కు లేదు అని ప్రకటించుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి ఊహించని షాక్. ఎందుకంటే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కలలు కంటున్నప్రధాని పదవి అందుకోవాలి అంటే అది ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటం లేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇఫ్తార్ విందు సందర్భగా కూడా కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని మరో సారి ప్రకటించారు కెసిఆర్ . ఇప్పటి దాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ లకు అసలు పాలనే చేత కాదు...తాము అధికారంలోకి వచ్చాక ఇండియా ను అమెరికా, చైనా లను దాటేలా తీర్చిదిద్దుతామని...ఈ దిశగా తమ విధానాలు ఉంటాయని పలు మార్లు ప్రకటించారు. తాజాగా టైమ్స్ నౌ అనే జాతీయ ఛానల్ ఒక సర్వే చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి...ప్రధాని అభ్యర్థి రేస్ లో ముందు వరసలో ఉన్న వారు ఎవరు అంటూ పలు వివరాలు ప్రసారం చేసింది. దీని ప్రకారం చూస్తే మళ్ళీ కేంద్రంలో మోడీ సర్కారే వస్తుంది...అది కూడా పూర్తి మెజారిటీ తో అంటూ అంచనాలు వెలువరించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి 292 నుంచి 338 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ కి 106 నుంచి 144 వరకు అంటూ లెక్కలు వేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి 20 నుంచి 22 సీట్లు, బీజేడీ కి 11 నుంచి 13 సీట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కి 24 నుంచి 25 లోక్ సభ సీట్లు వస్తాయని, ఇతరులకు 50 నుంచి 80 సీట్ల వరకు రావొచ్చు అంటూ పేర్కొంది. అంటే 17 సీట్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ కు వచ్చే సీట్లు ఇతరుల్లో కలిపారు తప్ప విడిగా ఇవ్వలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ వైసీపీ కి 24 నుంచి 25 సీట్లు వస్తాయనే అంచనాలపై పలు అనుమానాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఏ మాత్రం లేదు. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ లో బిఆర్ఎస్ గెలుచుకునే సీట్ల లెక్క ఇవ్వలేదు. కానీ..కెసిఆర్ ని 2024 లోక్ సభ ఎన్నికల కు ప్రధాని అభ్యర్థుల జాబితాలో పెట్టారు. అయితే ఆయనకు కేవలం ఐదు శాతం మాత్రమే మద్దదు వచ్చింది. ప్రధాని మోడీ కి 64 శాతం, రాహుల్ గాంధీ కి 13 శాతం, కేజ్రీవాల్ కు 12 శాతం, నితీష్ కుమార్ కు ఆరు శాతం మంది మద్దదు పలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కు వోట్ షేర్ ఎంత ఉండే అవకాశం ఉంది అని అంచనాలు వేయగా బీజేపీ కి 38 . 2 శాతం, కాంగ్రెస్ పార్టీ కి 28 . 7 శాతం , ఇతరులకు 33 . 1 శాతం వోట్ షేర్ ఉన్నట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. అసలు కెసిఆర్ ఇంకా నేరుగా రంగంలోకి దిగక ముందే ప్రధాని రేస్ లో ఐదు శాతం మద్దతు వచ్చింది...నేరుగా రంగంలోకి దిగితే ఇది మారిపోతుంది అని బిఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి తృప్తి పడొచ్చు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా జాతీయ స్థాయిలో యాడ్స్ కుమ్ముతున్నా కూడా ఇది కూడా ఇంకా పెద్ద వర్క్ అవుట్ అయినట్టు లేదు. ఇది చూసి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి యాడ్స్ ఎటాక్ మరింత పెంచుతారేమో. ఇప్పటికే లోకల్ గా అయితే టీవీ ల్లో ఊదరగొడుతున్నారు.

Next Story
Share it