Telugu Gateway
Politics

ఉద్యోగుల‌తో చ‌ర్చించాకే పీఆర్సీ ప్ర‌క‌టించాం

ఉద్యోగుల‌తో చ‌ర్చించాకే పీఆర్సీ ప్ర‌క‌టించాం
X

ఉద్యోగుల ఉద్యమంపై ఏపీ మంత్రులు ఎదురుదాడి ప్రారంభించారు. వారితో చ‌ర్చించాకే పీఆర్సీ ప్ర‌క‌టించామ‌ని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆదిమూల‌పు సురేష్ లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉద్యోగులు సమ్మె అన‌టం స‌రికాద‌న్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. మ‌రో మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ కూడా ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగిందన్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరి కాదన్నారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగస్తులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగస్తులకు జీవోలు ఏకపక్షంగా అడ్డగోలుగా ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని చెప్పారు. జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని... వాటన్నిటినీ పరిశీలించి వాటిపై ఆలోచిస్తామన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు... కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. వారితో చ‌ర్చించాకే జీవోలు జారీ చేస్తే..ఇప్పుడు ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని చెప్పటం స‌రైన విధానం కాద‌న్నారు.

Next Story
Share it