Telugu Gateway
Politics

మొహం చెల్ల‌కే కెసీఆర్ ప్ర‌చారానికి రాలేదు

మొహం చెల్ల‌కే కెసీఆర్ ప్ర‌చారానికి రాలేదు
X

తెలంగాణ‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసింది. ఇక తుది పోరు మాత్ర‌మే మిగిలింది. అక్టోబ‌ర్ 30న ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బిజెపి అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ గెలుపు ఖాయం అని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. అది కూడా ఈటెల భారీ మెజారిటీతో గెలుస్తార‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ పార్టీ సామ‌ర్ధ్యాన్ని న‌మ్మి గెలిపించ‌బోతున్నార‌ని తెలిపారు. ఆయ‌న బుధ‌వారం నాడు క‌రీంన‌గ‌ర్ లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ద‌ళిత‌బంధు విష‌యంలో వాళ్ల గోతిలో వాళ్లే ప‌డ్డార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ‌కు అన్న‌పూర్ణ‌గా పేరుంద‌ని..అలాంటిది వ‌రి వేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌టానికి అధికారులు ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. గ‌తంలో కేంద్రం వ‌రి కొన‌లేదా అని ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో కూడా కేంద్రం ధాన్యం కూడా కొంటుంద‌ని తెలిపారు.

ముఖం చెల్ల‌కే సీఎం కెసీఆర్ హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాలేద‌ని ఎద్దేవా చేశారు. డెబ్బ‌యి రోజులుగా ద‌ళిత‌బంధు ఎందుకు ఆపార‌ని ప్ర‌జ‌లు ఎక్క‌డ ప్ర‌శ్నిస్తారో అని భ‌య‌పడ్డార‌న్నారు. అధికారుల అండ‌తో టీఆర్ఎస్ కు ఓటుకు 20 వేల రూపాయ‌లు పంచ‌టంలో విజ‌యం సాధించింద‌ని తెలిపారు. ఎన్నిక‌ల బాధ్య‌త‌లో ఉన్న అధికారులు, సిబ్బంది నిజాయ‌తీతో వ్య‌వ‌హరించాల‌న్నారు. హుజూరాబాద్ ప్ర‌జ‌లు విజ్ణ‌త‌తో ఆలోచించి కెసీఆర్ కు ఈ ఎన్నిక‌ల ద్వారా గుణ‌పాఠం చెప్పాల‌న్నారు. అహంకార‌, అవినీతి ప్ర‌భుత్వాన్ని త‌ర‌మికొట్టేందుకు అవ‌స‌ర‌మైన ఉత్సాహన్ని ఈ ఎన్నిక ద్వారా ఇవ్వాల‌న్నారు. ఈటెల రాజేంద‌ర్ ఈ ఉప ఎన్నిక కోసం చెమ‌టోడ్చారు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it