Telugu Gateway
Politics

స్టాక్ డైలాగుల బీజేపీ రాజకీయం

స్టాక్ డైలాగుల బీజేపీ  రాజకీయం
X

అతి పెద్ద పార్టీగా ఉండి..దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాజకీయాలు కామెడీని తలపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా లు దేశంలోనే వైసీపీ సర్కారు అత్యంత అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తారు. రాజధాని అమరావతి మార్పు దగ్గర నుంచి గత నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ఆడిందే అట...పాడిందే పాటగా ఉన్నా కూడా ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. సరే అక్కడ సీన్ కట్ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ తాజగా తెలంగాణ కు వచ్చి దేశంలోనే అత్యంత అవినీతి సర్కారు కెసిఆర్ ది , బిఆర్ఎస్ ది అంటూ విమర్శలు చేశారు . సహజంగా ఫస్ట్ ప్లేస్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ బీజేపీ అగ్రనేతలు ఎక్కడ విపక్ష పాలిత రాష్ట్రానికి వెళ్లినా ఇదే స్టాక్ డైలాగులు వాడుతున్నారు తప్ప ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మోడీ తాజాగా ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన సందర్భంగా కూడా కాంగ్రెస్ కు ఈ రాష్ట్రం ఎటిఎం లా మారింది అంటూ అవే పాత డైలాగులు వల్లే వేశారు.

నిన్న మొన్నటివరకు కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఎక్కడా రాలేదు అనే చెప్పొచ్చు. కానీ కర్ణాటకలో బీజేపీ పాలించినంత కాలం అసలు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు కీలక నేతలు. ఇప్పుడు మరో విశేషం ఏమిటి అంటే తాజాగా తెలంగాణ, బీజేపీ రాష్ట్ర శాఖల మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలంగాణలో ఫైటింగ్ స్పిరిట్ చూపించిన బండి సంజయ్ కు అదే పదవి...ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ తో కలిసి పార్టీ ని దెబ్బతీశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజు కు అదే పదవి. మరి ఇందులో తెలంగాణాలో నిన్న మొన్నటి వరకు పార్టీ కి మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ కు ప్రత్యేకంగా దక్కిన గౌరవం ఏముంది అని కొంత మంది బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాదిన ఎలా ఉందో కానీ ఇక్కడ మాత్రం తమ పార్టీ రాజకీయాలు కామెడీని తలపిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it