Telugu Gateway
Politics

జ‌న‌సేన డిమాండ్..నో అంటున్న బిజెపి!

జ‌న‌సేన డిమాండ్..నో అంటున్న బిజెపి!
X

ఏపీ రాజ‌కీయాల ఒక్క‌సారిగా హాట్ హాట్ గా మారాయి. అయితే ఈ వేడి పెంచింది అధికార వైసీపీనో..ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన తెలుగుదేశం పార్టీనో కాదు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా పొత్తుల‌పై ఇచ్చిన మూడు ఆప్ష‌న్స్ తో ఒక్క‌సారిగావేడి రాజుకుంది. అంతే కాదు..ప‌వ‌న్ క‌ళ్యాణే సీఎం అంటూ జ‌న‌సేన జోరుగా ప్ర‌చారం చేసుకుంటుంది. అస‌లు అది ఎలా సాధ్యం అవుతుంది అన్న అంశాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆ పార్టీ ప‌వ‌న్ సీఎం నినాదాన్ని తెర‌పైకి తెచ్చింది. ఆదివారం నాడు చిరంజీవి అభిమాన సంఘం నేత‌ల‌తో స‌మావేశం అయిన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎం చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. ఆ త‌ర్వాత ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బిజెపి జాతీయ ప్రెసిడెంట్ న‌డ్డా బిజెపి,జ‌న‌సేన‌ల ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి పోతిన వెంక‌ట‌మ‌హేష్ డిమాండ్ చేశారు.

అయితే ఈ డిమాండ్ ను బిజెపి నేతలు తోసిపుచ్చారు. జ‌న‌సేన అల్టిమేటంల‌కు తాము భ‌య‌ప‌డం అని వ్యాఖ్యానించారు. అంతే కాదు..బిజెపిలో సీఎం స్థాయి నాయ‌కులు చాలా మంది ఉన్నారంటూ జ‌న‌సేన నేత‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు మాట్లాడుతూ న‌డ్డా ప‌ర్య‌ట‌న‌లో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఏమీ ఉండ‌వ‌న్నారు. మ‌రి నిజంగా జ‌న‌సేన నేత‌లు డిమాండ్ చేస్తున్న‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను బిజెపి ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తుందా?. ఇంత త్వ‌ర‌గా అస‌లు అలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా?. త‌న‌కు అలాంటి ఆశ‌లు ఏమీ లేవ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతుంటే ఓ వైపు నాదెండ్ల మ‌నోహ‌ర్, పోతిన వెంక‌ట‌మ‌హేష్ లు ఈ డిమాండ్ ను తెర‌పైకి తేవ‌టం వెన‌క క‌థ ఏమిటి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story
Share it