Telugu Gateway
Politics

బిజెపి ప్రగతి భవన్ ముట్టడి

బిజెపి ప్రగతి భవన్ ముట్టడి
X

తెలంగాణ బిజెపి నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతోంది. రాజకీయ వేడి ఏ మాత్రం తగ్గకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం నాడు బిజెపి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. దీంతో ప్రగతి భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో నిరసన తెలియజేశారు. ముందుగానే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మేం ఏమైనా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకుంటే, ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము.. ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి మేము అంటూ మండిపడ్డారు. తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌ గౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు.

Next Story
Share it