Telugu Gateway
Politics

కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కు బీజేపీ బ్రేకులు వేస్తుందా?!

కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కు బీజేపీ బ్రేకులు వేస్తుందా?!
X

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి చాలా రోజులుగా విస్తృత చర్చలు సాగుతున్నాయి. సీఎం కెసిఆర్ దూకుడు చూసి ముందస్తు ఖాయం అనే అభిప్రాయంతో కాంగ్రెస్, బీజేపీ లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు పలు మార్లు స్పష్టం చేశారు కూడా. దీంతో అన్ని పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే 2023 డిసెంబర్ లోపు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే షెడ్యూలు కంటే ముందు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నారని చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు, ఎంపీ కే. లక్ష్మణ్ సంచలన వ్యాఖలు చేశారు. అయన మాటలు చూస్తే కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కు బీజేపీ బ్రేకులు వేస్తుందా అన్న అనుమానం రాక మానదు. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీ రద్దు చేస్తే ఇక అంతే సంగతులు అన్నట్లు లక్ష్మణ్ ఆదివారం నాడు మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావాలని కెసిఆర్ భావిస్తున్నారని..అసెంబ్లీ రద్దు వరకే సీఎం చేతుల్లో ఉంటుంది అని..ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు పెట్టాలని ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది అన్నారు.

ఎన్నికల సంఘం కెసిఆర్ జేబు సంస్థ కాదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఎన్నికలను అడ్డుకొనే ఛాన్స్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) కేంద్రంలోని మోడీ సర్కారు చెప్పినట్లే నడుచుకుంది అనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ అడ్వకేట్, ఎంపీ కపిల్ సిబాల్ కూడా ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆంత మంచిది అని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విషయంలో కూడా ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కొంది. ఈ తరుణంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ తరుణంలో మరి ముందస్తు ఉంటుందా...కెసిఆర్ అలాంటి సాహసం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it