Telugu Gateway
Politics

అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ

అస్సాంలో హ్యాట్రిక్  విజయం దిశగా బీజేపీ
X

ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్‌ పోల్‌ వెల్లడిరచింది. 2025 నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్‌ను తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసి వస్తోందని సర్వేలో వెల్లడయ్యింది. వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అస్సాంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. ఈ సర్వే పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌, పొలిటికల్‌ ఎనలిస్ట్‌ డా. రాజన్‌ పాండే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ‘‘ఈ ట్రాకర్‌ పోల్‌ ప్రస్తుత సమయంలో అస్సాం ఓటర్ల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. అధికార ప్రయోజనాలకే పరిమితం కాకుండా విభిన్న వర్గాలతో బీజేపీకి బలమైన అనుసంధానం ఏర్పడినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏఐయుడీఎఫ్‌, యూపీపీఎల్‌ వంటి పార్టీలు మనుగడకే పోరాడుతున్న నేపథ్యంలో ఎన్‌డీఏ విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది’’.

బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం

పీపుల్స్‌ పల్స్‌ ట్రాకర్‌ పోల్‌ అంచనా ప్రకారం బీజేపీ 69-74 సీట్లతో అగ్రస్థానంలో నిలవనుంది. కాంగ్రెస్‌కు 25-29 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్‌డీఏ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ)కు 8-11 సీట్లు, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)కు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. ఏఐయుడీఎఫ్‌ 0-2, యూపీపీఎల్‌ 0-2, రైజర్‌ దళ్‌ 1-2, అస్సాం జాతీయ పరిషత్‌ (ఏజేపీ) 0-1, సీపీఐ(ఎం) 0-1, స్వతంత్రులు/ఇతరులు 0-1 గెలిచే అవకాశం ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 64 సీట్ల మెజారిటీకి ఎన్‌డీఏ చాలా ఆధిక్యంలో నిలుస్తోంది. బీజేపీ మూడోసారి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్‌ గతంలో సాధించిన మూడు వరుస విజయాల సరసన నిలుస్తుంది. బీజేపీ తన కోర్‌ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే కొత్త వర్గాల్లోకి విస్తరించగలగడమే దీనికి కారణమని ఈ ట్రాకర్‌ పోల్‌ సర్వేలో తేలింది. ఓట్‌ షేర్‌ విషయానికి వస్తే బీజేపీకి 39%, కాంగ్రెస్‌కు 37% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతంలో తేడా తక్కువే ఉన్నప్పటికీ... అస్సాంలోని ఉత్కంఠ ఎన్నికల వాతావరణంలో ఇది సీట్ల పరంగా గణనీయమైన తేడాకు కారణం కావొచ్చు. ఇతర పార్టీల ఓట్‌ షేర్లు చూస్తే... ఏజీపీ 7%, బీపీఎఫ్‌ 5.5%, యూపీపీఎల్‌ 1.2%, ఏఐయుడీఎఫ్‌ 2.5%, రైజర్‌ దళ్‌ 0.9%, ఏజేపీ 0.7%, సీపీఐ(ఎం) 0.8%, ఇతరులు 5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ఏఐయుడీఎఫ్‌ నుంచి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లడంతో కాంగ్రెస్‌ ఓట్‌ షేర్‌ పెరిగిందని, అయితే డీలిమిటేషన్‌, ఎన్‌డీఏ సామాజిక కూటములు, బలహీన ప్రతిపక్ష భాగస్వాములు కారణంగా తన ఓటు బ్యాంకును సీట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడుతోందని ఈ సర్వేలో వెల్లడయ్యింది.

కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

తదుపరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు 30% మద్దతుతో స్వల్ప ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు 28%, కాంగ్రెస్‌ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్‌ గోగోయ్‌కు 27% ఓటర్లు మద్దతిచ్చారు. దేబబ్రత సైకియా 3%, హగ్రామా మోహిలారి 1%, అతుల్‌ బోరా 1%, దిలీప్‌ సైకియా 1%, బద్రుద్దీన్‌ అజ్మల్‌ 1%, అఖిల్‌ గోగోయ్‌ 1% తో వెనకంజలో ఉన్నారు. 7% మంది ఓటర్లు తాము ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. గౌరవ్‌ గోగోయ్‌ వ్యక్తిగత ప్రజాదరణ, సీఎం రేసులో ముందంజలో ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా మారలేదు. హిమంత బిశ్వ శర్మ స్వల్ప ఆధిక్యానికి మహిళా ఓటర్ల బలమైన మద్దతు తోడైంది. గిరిజనులు, పురుషులు ఎక్కువమంది సోనోవాల్‌ వైపు మొగ్గు చూపించారు.

బీజేపీకే మద్దతు

అస్సాం రాష్ట్ర అభివ ృద్ధికి ఏ పార్టీ మంచిదన్న ప్రశ్నకు 48% బీజేపీకి, 38% కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు 55% బీజేపీ గెలుస్తుందని భావించగా, కాంగ్రెస్‌కు 40% మంది మద్దతు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్నకు 55% బీజేపీకి అనుకూలంగా, 45% వ్యతిరేకంగా స్పందించారు. అభివృద్ధి, సంక్షేమం, వివిధ వర్గాల మద్దతు, సీఎం ఎంపిక, పార్టీ ప్రదర్శ, వయస్సు, లింగ పరమైన అంశాల్లో బీజేపీ సమగ్ర ఆధిక్యం కనిపించింది. 2021 నుంచి జరిగిన మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ఉపఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ రావడం ఆ పార్టీని మరింత బలోపేతం చేశాయి. గిరిజనులు, ఓబీసీల్లో కూడా మద్దతు సంపాదించి, ఎన్‌డీఏ తన పరిధిని మరింత విస్తరించింది. కాంగ్రెస్‌కు లభించిన స్వల్ప మద్దతు కూడా ప్రధానంగా బరాక్‌ వ్యాలీ, లోయర్‌ అస్సాంలో ఏఐయుడీఎఫ్‌ నుంచి ముస్లిం ఓటర్లు మారడం వల్లనే అని సర్వేలో తేలింది. వ్యాపార ప్రయోజనాలు, వివాదాస్పద కూటములపై అభిప్రాయాలతో ఏఐయుడీఎఫ్‌ రాజకీయంగా ఒంటరిగా మారింది. ఏజీపీ బీజేపీపై ఆధారపడుతోంది. కూటమి లేకుండా దాని పునాదులు క్షీణిస్తున్నాయి. యూపీపీఎల్‌ ఇటీవల బీటీఏడీ ఎన్నికల్లో బలహీన ప్రదర్శనతో మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. బోడో ఓటర్లు తిరిగి బీపీఎఫ్‌ వైపు మళ్లారు. బీజేపీ-బీపీఎఫ్‌ పునఃసమ్మేళనం బీటీఏడీ ప్రాంతాల్లో క్లీన్‌ స్వీప్‌కు దారులు వేస్తున్నాయి. రైజర్‌ దళ్‌, ఏజేపీ వంటి చిన్న పార్టీలు పరిమిత ప్రభావంతోనే ఉన్నాయి.

ఏ కులం ఎటువైపు?

కులాల పరంగా చూస్తే... అస్సామీలు ప్రధానంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్‌ తో పాటు ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. అహోములు సివసాగర్‌, జోర్హాట్‌ వంటి కొద్ది ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇతర ఓబీసీలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. సీఏఏ తర్వాత హిందూ బెంగాలీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు అధికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఏఐయుడీఎఫ్‌ను తిరస్కరిస్తున్నారు. గిరిజనుల్లో ఎన్‌డీఏ పట్ల ఆకర్షణ రోజురోజుకు పెరుగుతుండగా... బోడోలు బీపీఎఫ్‌-బీజేపీకి, మిసింగ్స్‌, కార్బీలు, డిమాసాలు తదితరులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల కొంతవరకు టీ తోటల సమూహాలు బీజేపీతోనే ఉన్నప్పటికీ, వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.

Next Story
Share it