కెసీఆర్ చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల సంఘం
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ తీరుపై బిజెపి మండిపడింది. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ వ్యవధిలో ఎన్నికల నిర్వహించిన దాఖలాలు లేవు. ఇదే బిజెపి ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మలా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోన్న పద్ధతిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పోలింగ్ తేదీలను ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఒక అలవాటుగా మారిపోయిందన్నారు.
ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని అన్నారు. ఇది బయటి వారి ప్రమేయం లేకుండా పనిచేయాలన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ చెప్పినట్టు ఆడుతోందని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల సంఘం ప్రవర్తన ఉందని ఆయన ధ్వజమెత్తారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు..4న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎస్ఈసీ సి. పార్ధసారధి ప్రకటించిన విషయం తెలిసిందే.