Telugu Gateway
Politics

తిరుపతి బిజెపి లోక్ సభ అభ్యర్ధిగా రత్నప్రభ

తిరుపతి బిజెపి లోక్ సభ అభ్యర్ధిగా రత్నప్రభ
X

ప్రచారమే నిజం అయింది. రిటైర్డ్ ఐఏఎస్, కర్ణాటక మాజీ సీఎస్ కె. రత్నప్రభను తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలపాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు ఆమె పేరును గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్ధులను ప్రకటించినట్లు అయింది. ఇప్పటికే అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించగా..టీడీపీ కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీకి టిక్కెట్ ఇచ్చింది. చివరగా ఇప్పుడు బిజెపి రత్నప్రభ పేరును అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి మొదటి నుంచి తిరుపతి లోక్ సభ బరిలో మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన దాసరి శ్రీనివాసులు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా తనకు సీటు గ్యారంటీ అని నమ్ముతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే బిజెపి రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఎన్నికల సమన్వయ కమిటీ లో దాసరి శ్రీనివాసులు పేరు ఉందో అప్పడే ఆయనకు సీటు లేదనే విషయం నిర్ధారణ అయింది.

ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో ఇక తిరుపతి ఉప ఎన్నిక రాజకీయంగా మరింత వేడెక్కటం ఖాయంగా కన్పిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రత్నప్రభ అత్యంత కీలకమైన ఐటి శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. జగన్ కేసుల్లో ఆమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నా..తర్వాత ఈ కేసుల నుంచి బయటపడ్డారు. మరి రత్నప్రభ ఈ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ సర్కారుపై ఏ మేరకు ఎటాక్ చేస్తారో వేచిచూడాల్సిందే. అయితే టీడీపీ, బిజెపి లు మహిళా అభ్యర్ధులను బరిలో దింపటం విశేషం.

Next Story
Share it