బీహార్ ఎన్నికలు..మోడీ, నితీష్ కూటమికి షాక్
జాతీయ ఛానళ్లు అన్నీ అదే చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకు షాక్ తప్పదని తేలింది. ప్రధాని నరేంద్రమోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 'డబుల్ ఇంజన్' ఉండాలని పదే పదే చెప్పారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో జెడీయూ కూటమి ఉంటేనే ప్రగతి సాధ్యం అవుతుందని ప్రచారం చేశారు. అయితే లాలూప్రసాద్ ఇది డబుల్ ఇంజన్ కాదు..ట్రబుల్ ఇంజన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఆర్జేడీ తరపున బాధ్యతలు అన్ని భుజాన వేసుకున్న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తన సత్తా చాటారు. కాంగ్రెస్ తోపాటు వామపక్షాలతో కలసి ఆయన ఈ సారి విజయం దక్కించుకోబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాకూటమి (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
బీహార్‌లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాకూటమికి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు తేల్చారు. ఇండియా టుడే తోపాటు పలు ఛానళ్ళు నిర్వహించిన సర్వేల్లో నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్ కు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎక్కువ మంది ఓటు వేయటం కీలకంగా మారింది.
టైమ్స్ నౌ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకి 116, మహాకూటమికి 120, ఎల్జేపీకి 1, ఇతరులకు ఆరు సీట్లు రానున్నాయి. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎన్డీయేకు 104-128, మహాకూటమికి 108-131, ఎల్జేపీకి1-3, ఇతరులకు 4-8 సీట్లు వస్తాయని అంచనా వేశారు. రిపబ్లిక్- జన్ కీ బాత్ లెక్కల ప్రకారం ఎన్డీయేకి 91-117, మహాకూటమికి 118-138 , ఎల్జేపీకి 5-8 ఇతరులకు 3-6 సీట్లు, పీపుల్స్ పల్స్ ఎన్డీయేకి 90-110 , మహాకూటమికి 100-115 , ఎల్జేపీకి 3-5 , ఇతరులకు 8-18 సీట్లు వస్తాయని అంచనా వేశారు.