Telugu Gateway
Politics

రెండు దశల్లో ఎన్నికలు

రెండు దశల్లో ఎన్నికలు
X

కీలక రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 6 న, రెండవ దశ ఎన్నికలు నవంబర్ 11 న జరగనున్నాయి. నవంబర్ 14 న ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలి దశ లో 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో...రెండవ దశలో 122 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్లు తొలి దశకు అక్టోబర్ 10 న, రెండవ దశకు అక్టోబర్ 13 న జారీ కానున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్లతో కలిసి బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7 .43 కోట్ల మంది ఓటర్లు ఉండగా 90712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది అన్నారు. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22 తో ముగియనుంది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించామని తెలిపారు. ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని కూడా సీఈసీ తెలిపింది. నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు కూడా.. ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సారి ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడించింది. బీహార్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి తిరిగి మరో సారి అధికారంలోకి రావాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది.

అయితే కూటమికి రాజకీయ వాతావరణం ఏమంత అనుకూలంగా లేదు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వాళ్ళ ఖాతాల్లోకి పదివేల రూపాయల నగదు బదిలీ చేశారు. మరో వైపు యూపీఎ కూటమి కూడా బీహార్ లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జె డీ), కాంగ్రెస్ తోపాటు మరికొన్ని భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి. అధికార ఎన్ డీఏ లో జె డీ యూ , బీజేపీ తో పాటు రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన ఎల్ జె పీ లు ఉన్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కూడా రెండు కూటముల్లో ఇంకా సీట్లు సర్దుబాటు వ్యవహారం మాత్రం తేలలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పెద్ద దుమారమే రేపింది. ఈ ఎన్నికల నుంచే తొలిసారి ఈవీఎం లపై అభ్యర్థుల కలర్ ఫోటో లను కూడా ముద్రించబోతున్నారు.

Next Story
Share it