వ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
బిజెపి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అంతా బిజెపి సర్కారు ఏర్పాటు అవుతుందని భావిస్తే...ఆ పార్టీ గొప్ప ట్విస్ట్ ఇచ్చింది. ఏక్ నాథ్ షిండేనే ముఖ్యమంత్రి అని బిజెపి నేత దేవంద్ర ఫడ్నవీస్ కీలక ప్రకటన చేశారు. బిజెపి ఆయనకు పూర్తి మద్దతు అందిస్తుందని..అయితే తాము ప్రభుత్వంలో భాగస్వామిని కావటంలేదన్నారు. ఇది అంతా చూస్తుంటే పక్కా వ్యూహం ప్రకారమే ఉథ్ధవ్ ఠాక్రే సారధ్యంలోని పార్టీని పూర్తిగా దెబ్బకొట్టేందుకే బిజెపి ఇలా చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ పని బిజెపి చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున అదే పనిని శివసేన చీలిక గ్రూపుతో చేయిస్తే తమ పని రాబోయే రోజుల్లో మరింత సులభం అవుతుందన్నది బిజెపి ప్లాన్ గా భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిజెపి నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా పెద్ద షాక్ లాంటిదే అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో బిజెపి-శివసేన కలసి పోటీ చేసి మెజారిటీ సీట్లు పొందిన సీఎం సీటు దగ్గర వివాదంతో శివసేన తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఇది బిజెపిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గత కొంత కాలంగా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేసింది. అది ఇప్పుడు సఫలం అయింది. గురువారం నాడు వేగంగా జరిగిన పరిణామాల అనంతరం ఫడ్నవీస్ మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేశారు.
మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే గురువారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి మహారాష్ట్ర లాంటి..అందునా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయ్ వంటి నగరం ఉన్న రాష్ట్రంలో అధికారం చేపట్టకుండా ఉంది అంటే ఆ లెక్క ఖచ్చితంగా వేరే ఉందని ఊహించుకోవచ్చు. దీని ప్రకారం తాను చేయాలనుకున్న పనులు అన్నీ కూడా బీజేపీ ఇక వెనకుండి నడిపించేందుకు సిద్ధమైనట్లు కన్పిస్తోంది. ఫడ్నీవీస్ తర్వాత షిండే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదివిని తాను ఏనాడూ ఆశించలేదని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. బీజేపీ పెద్ద మనసుతో సీఎం పదవి తమకు ఇచ్చిందని ఆయన అన్నారు. బాల్ థాక్రే ఆశయాలను కొనసాగిస్తానని, హిందుత్వ ఎజెండా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 'ఔరంగాబాద్ పేరు మార్చడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలవడానికి ప్రయత్నించా. ఉద్దవ్ ఠాక్రే మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.' అని ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు.