Telugu Gateway
Politics

టీఆర్ఎస్ కు బిగ్ షాక్

టీఆర్ఎస్ కు  బిగ్ షాక్
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్)లోకి కొత్తగా వ‌చ్చిన వారికే ఎక్కుత ప్రాధాన్య‌వ‌ ద‌క్కుతోంద‌ని..ఉద్య‌మ స‌మ‌యం నుంచి పార్టీని న‌మ్ముకున్న వారికి అన్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది. తాజాగా రాజ్య‌స‌భ సీట్ల కేటాయింపు కూడా పార్టీలో ఇదే చ‌ర్చ‌కు కార‌ణం అయింది. ముఖ్యంగా పారిశ్రామిక‌వేత్త‌లైన హెటిరో పార్ధ‌సార‌ధిరెడ్డికి, గాయ‌త్రి ర‌వికి అత్యంత కీల‌క‌మైన రాజ్య‌స‌భ సీట్లు ఇవ్వ‌టం టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది. గాయ‌త్రి ర‌వి కొద్ది కాలం క్రిత‌మే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ లో చేరారు. హెటిరో పార్ధ‌సార‌ధి రెడ్డికి అయితే నేరుగా పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అంతే కాదు క‌రోనా స‌మ‌యంలో జ‌రిగిన ఐటి దాడుల్లో ఆయ‌న ఆఫీసులు..కార్యాల‌యాల్లో వందల కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నం వెలుగుచూసిన విష‌యం తెలిసిందే. అలాంటి వ్య‌క్తికి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌టం ఏమిటి అనే చ‌ర్చ సాగుతోంది.

ఈ త‌రుణంలో అధికార టీఆర్ఎస్ కు గురువారం నాడు బిగ్ షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార‍్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌ల‌సి వారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి ఉన్నా కూడా ఏ మాత్రం గౌర‌వంలేద‌న్నారు. అందుకే పార్టీని వీడిన‌ట్లు తెలిపారు.

Next Story
Share it