Telugu Gateway
Politics

రేవంత్ కు అధిష్టానం షాకిచ్చిందా?!

రేవంత్ కు అధిష్టానం షాకిచ్చిందా?!
X

తెలంగాణ‌లో కాంగ్రెస్ లో కీలక‌ ప‌రిణామం. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడుకు సీనియ‌ర్లు క‌ళ్లెం వేశారా?. అంటే ఔన‌ని అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి రేవంత్ ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ల్ల‌మ‌ల్ల క్రిష్ణారెడ్డి. మునుగోడుకు ఉప ఎన్నిక ఖ‌రారు అని తేలిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న పేరే ప్ర‌ముఖంగా విన్పిస్తూ వ‌చ్చింది. ఆర్ధికంగా బిజెపి త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌నున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్దిని ఢీకొట్టాలంటే చ‌ల్ల‌మ‌ల్ల క్రిష్ణారెడ్డి మాత్ర‌మే తూగ‌గ‌ల‌ర‌నే చ‌ర్చ‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. రేవంత్ క్యాంప్ నుంచి ప్ర‌ముఖంగా విన్పించిన పేరు మాత్రం ఇదే. అయితే న‌ల్ల‌గొండ‌కు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేతలు అంద‌రూ దివంగ‌త నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూతురు పాల్వాయి స్ర‌వంతి వైపు మొగ్గుచూపారు. వీరు అధిష్టానానికి కూడా ఇదే పేరు సూచించారు. ముఖ్యంగా పాల్వాయి స్ర‌వంతితోపాటు చ‌ల్ల‌మ‌ల్ల క్రిష్ణారెడ్డి పేర్లు ఢిల్లీకి చేరాయి. శుక్ర‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ పాల్వాయి స్ర‌వంతి పేరును మునుగోడు ఉప ఎన్నిక‌కు అధికారికంగా ప్ర‌క‌టించింది.

దీంతో రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలిన‌ట్లు అయింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీల‌క‌మైన ఉప ఎన్నిక అభ్య‌ర్ధి విష‌యంలో ఆయ‌న మాట చెల్లుబాటు కాలేద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇది సీనియ‌ర్ల‌కు సంతోషాన్ని మిగ‌ల్చ‌గా..రేవంత్ క్యాంప్ కు ఒకింత నిరాశ క‌లిగించింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు పాల్వాయి స్ర‌వంతి గెలుపు కోసం ఆయ‌న త‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి ఇప్పుడు చ‌ల్ల‌మ‌ల‌ క్రిష్ణారెడ్డి ఈ ఎన్నిక‌లో స్ర‌వంతికి స‌హక‌రిస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. కాంగ్రెస్, బిజెపి అభ్య‌ర్దులు ఎవ‌రో తేలిపోయారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సి ఉంది. గ‌తానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ చివ‌రి నిమిషం వ‌ర‌కూ నాన్చ‌కుండా కాస్త తొంద‌ర‌గానే అభ్యర్ధిని ప్ర‌క‌టించ‌టం శుభ‌ప‌రిణామంగా పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Next Story
Share it