శివసేనకు మరో ఎదురుదెబ్బ
శివసేనకు దెబ్బ మీద దెబ్బపడుతోంది. మహారాష్ట్రలో అధికారం పోవటమే కాదు..ఇప్పుడు అసలు పార్టీనే నిలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఎక్కడా కూడా శివసేనకు, ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా..తమదే అసలైన శివసేన పార్టీ అని..హిందుత్వను కాపాడేది తామే అంటూ ప్రకటించుకుంటూ వస్తున్నారు. అసెంబ్లీలో చీలిక గ్రూపునకు గుర్తింపు లభించింది. ఇక జరగాల్సిన తంతు అంతా బయటే. ఈ తరుణంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. థానే కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూపులో చేరారు. ఈ మేరకు మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్‌లోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ షిండే గ్రూపులో చేరినట్టు ప్రకటించారు.
సీఎం షిండే నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని కార్పొరేటర్లు ప్రకటించారు. ఉద్ధవ్ థాకరే పక్షాన నిలబడిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా షిండే క్యాంపునకు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబయ్ తర్వాత అత్యంత కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ థానేనే. త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో మరి ఉద్ధవ్ ఠాక్రే ఏ మేరకు తన పట్టు నిలుపుకుంటారు..అది సాధ్యం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. శివసేన ఎంపీల్లో కూడా చాలా మంది షిండేకు మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మహారాష్ట్ర ప్రభుత్వంలో మొదలైన సమస్య ఇప్పుడు రాష్ట్రమంతటికీ విస్తరిస్తున్నట్లు కన్పిస్తోంది.