Telugu Gateway
Politics

యూపీలో బిజెపికి బిగ్ షాక్

యూపీలో బిజెపికి బిగ్ షాక్
X

అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అధికార బిజెపి పెద్ద ఎదురుదెబ్బ త‌గ‌లింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన కార్మిక శాఖ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య బిజెపికి గుడ్ బై చెప్పి ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాదు మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే బాట ప‌డుతున్నారు. అధికార పార్టీ నుంచి ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేలు ఎస్పీ వైపు వెళుతున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చ‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి. రైతు చ‌ట్టాల‌తోపాటు ప‌లు అంశాల‌పై యూపీలోని యోగీ స‌ర్కారు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే బిజెపి మాత్రం ఎలాగైనా యూపీని తిరిగి నిలబెట్టుకోవాల‌ని..లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలోకి రావ‌టం క‌ష్టం అనే అభిప్రాయంతో ఉంది.

బీజేపీలో కీలక ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య నిన్ననే మంత్రి పదవికి రాజీనామా చేశారు. యోగి ప్రభుత్వంలో ఓబీసీ, దళితులు, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. త‌న నిష్ర్కమణ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలనుందని ఆయన విలేకరులతో వ్యాఖ్యానించారు. ఓబీసీలో బలమైన నేతగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య 2016లో బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా ఎస్పీ గూటికి చేరారు. మంత్రి ధరమ్‌సింగ్ సైనితోపాటు మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలోనే అఖిలేష్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it