కేజ్రీవాల్ తో పాటు అగ్రనేతలంతా ఇంటికే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ కు బిగ్ షాక్ తగిలింది. అధికారం కోల్పోవటం ఒకెత్తు అయితే ..ఆ పార్టీ అగ్రనేతలు అంతా ఇంటి దారి పట్టారు. ఇందులో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలు అయ్యారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ ముగ్గురు అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహార్ జైలు లో ఉండి వచ్చిన వాళ్లే. అప్పటిలో వీళ్ళ అరెస్ట్ కూడా పెద్ద సంచలనంగా మారింది. అయితే కొంతలో కొంత ఊరట కల్పించే అంశం ఏమిటి అంటే ప్రస్తుతం ఢిల్లీ సీఎం గా ఉన్న అతిశీ మాత్రం విజయం సాధించారు. అది కూడా తక్కువ మెజార్టీతోనే. ఈమె బీజేపీ అభ్యర్థి రమేష్ భిదూరిపై 3500 ఓట్ల తేడా తో గెలుపొందారు.
పలు రౌండ్లలో వెనకబడిన అతిశీ మాత్రం చివరి రౌండ్స్ లో అనూహ్యంగా పుంజుకుని గెలుపు దక్కించుకున్నారు. అయితే ఢిల్లీ మాజీ సీఎం , ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను న్యూ ఢిల్లీ సీటు లో ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ కొత్త సీఎం రేస్ లో ముందు వరసలో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. అయన ఫలితం వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా బీజేపీ ఢిల్లీ లో బీజేపీ ఏకంగా 50 వరకు సీట్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా బీజేపీ ఎడ్జ్ లో ఉన్నట్లు స్పష్టం అయింది. చివరి వరకు అదే ట్రెండ్ కొనసాగడంతో ఆప్ కు చెందిన దిగ్గజ నేతలు కూడా దారుణ ఓటమిని చవిచూశారు. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే జైలు కు వెళ్లి వచ్చిన నాయకులు అంతా కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తారు అనే సెంటిమెంట్ ను కూడా ఢిల్లీ ఎన్నికలు బ్రేక్ చేశాయి అనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ దారుణ ఓటమికి లిక్కర్ స్కాం తో పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు అన్న ప్రచారం వంటి అంశాలు అప్ ను బాగానే దెబ్బకొట్టాయి. మరో వైపు ఎన్నికల ముందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తీసుకున్న 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు వంటి అంశాలు మధ్య తరగతి ఎక్కువగా ఉండే ఢిల్లీ లో మంచి ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.