ఫలితం ఒకటే...కానీ ప్రకంపనలు ఎన్నో!
తెలంగాణ రాజకీయాలకు బిగ్ డే. ఈ మంగళవారం. అందరి చూపులూ హుజూరాబాద్ వైపే. అత్యంత హోరాహోరీగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది. ఫలితం ఒక్కటే కానీ..ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు ఎన్నో. ఇప్పుడు అందరి ఫోకస్ వాటిపైనే. ఎన్నికల పోలింగ్ అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయం ఈటెల రాజేందర్ అని చెబుతున్నాయి. ఒకటి అరా మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంక్ గా ఉన్నదళితుల కోసం ప్రకటించిన దళితబంధు అధికార టీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందని తొలుత అంచనా వేసుకున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా హుజూరాబాద్ పై వరాల వర్షం...నిధుల మంజూరు సాగిపోయాయి. మరి ఇప్పుడు కెసీఆర్ మ్యాజిక్ ఫలిస్తుందా?. ఈటెల వ్యూహం విజయం సాధించబోతుందా అన్నది మంగళవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఈటెల రాజేందర్ విజయం సాదిస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఇది కీలక మార్పులకు నాందిపలికే అవకాశం ఉంది. ఒక వేళ అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తే మాత్రం ఈటెల రాజేందర్ రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో 86.64 శాతం నమోదు అయింది. భూ కబ్జా ఆరోపణలు..మంత్రివర్గం నుంచి తొలగింపు..ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయటంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఇందులో ప్రధాన పోటీ బిజెపి నుంచి బరిలోకి దిగిన ఈటెల రాజేందర్, అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ ల మధ్యే నెలకొంది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపినా ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే అనే అంచనాలు ఉన్నాయి. మంగళవారం నాటి కౌంటింగ్ కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. తుది ఫలితం మంగళవారం మధ్యాహ్నానికి వెల్లడి కావొచ్చని అంచనా. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో ఓటుకు ఆరు రూపాయలు పంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అది ఏపీ అయినా..తెలంగాణ అయినా ఓటుకు రెండు వేల రూపాయలు అంటేనే చాలా ఎక్కువ ఖర్చుపెట్టినట్లు లెక్క. కానీ ఇక్కడ ఏకంగా ఆరు వేల నుంచి పది వేల రూపాయల వరకూ అని వార్తలు రావటం చాలా మందిని షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. డబ్బు పంపిణీపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా ప్రధాన పార్టీలు రెండూ ఎవరి స్థాయిలో వారు పంపకాలు చేసినట్లు చెబుతున్నారు.