బిజెపికి 'బిగ్ బూస్ట్'
మరో రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి బిగ్ బూస్ట్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా నరేంద్రమోడీ హవా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ పలితాల విషయానికి వస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుకు తోడు మోడీ ఇమేజ్ కూడా ఉపయోగపడింది అన్నది కాదనలేని వాస్తవం. ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ కు చెందిన బిజెపికి మంత్రులు, ఎమ్మెల్యేలు వరస పెట్టి ఆ పార్టీకి రాజీనామా చేసే సమాజ్ వాది పార్టీలో చేరటంతోపాటు..ఈ సారి ఎస్పీ అధికారంలోకి రావటం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఎక్కువ మంది ఈ సారి బిజెపికి యూపీలో ఎదురుదెబ్బ తప్పదని భావించారు. ముఖ్యంగా రైతు బిల్లుల విషయంతోపాటు పెట్రో ధరల పెంపు తదితర అంశాలు బిజెపికి నష్టం చేస్తాయని లెక్కలు వేశారు. కానీ చాలా మంది అంచనాలను తలకిందులు చేస్తూ యోగి ఆదిత్యనాథ్ చరిత్రను తిరగరాశారు.
యూపీలో ప్రధానంగా శాంతి, భద్రతలను కాపాడటంతోపాటు..పేదలకు ఆహారం అందజేసే విషయంలో యోగీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు బిజెపికి మేలు చేశాయి. గత ప్రభుత్వాలతో పోలిస్తే యోగీ పాలనలో శాంతి, భదత్రలు చాలా వరకూ మెరుగు అవటంతో మహిళలు ఆయన సర్కారుకే మళ్లీ పట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయం పలు సర్వేల్లోనూ వెల్లడైంది. ఎవరైనా ప్రశాంతంగా జీవనం సాగిపోవాలని కోరుకుంటారు. అదే పరిస్థితిని కల్పించటంలో యోగి చాలా వరకూ సక్సెస్ కావటం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చింది. దీంతోపాటు ముఖ్యమంత్రిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకపోవటం కూడా ఆయన పాలనకు సానుకూల అంశంగా మారింది. అయితే గతంతో పోలిస్తే బిజెపికి ఈ ఎన్నికల్లో కాస్త సీట్లు తగ్గుతున్నా సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించేందుకు అవసరమైన మెజారిటీని సాధించింది. అదే సమయంలో ఎస్పీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్యను మాత్రం గణనీయంగా పెంచుకోగలిగింది. అధికారం సాధించాలనే ఆశలకూ చాలా దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ల్లో బిజెపి విజయకేతనం ఎగరేయటంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది.