Telugu Gateway
Politics

భూమా మౌనికారెడ్డి సంచలన వ్యాఖ్యలు

భూమా మౌనికారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

కిడ్నాప్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ సోదరి మౌనిఖారెడ్డి తెలంగాణ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఒత్తిళ్ళతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మనం హైదరాబాద్ లో ఉన్నామా?. పాకిస్తాన్ లో ఉన్నామా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అక్క అఖిలప్రియపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా వేధింపులకు గురిచేస్తున్నారని...పోలీసులే తీర్పులు ఇస్తే ఇక న్యాయస్థానాలు ఎందుకు అని ప్రశ్నించారు. తమకు హైదరాబాద్ లో రక్షణ కరువైందని అన్నారు. వేరే రాష్ట్రం అయితే ఇక్కడ ఆస్తులు ఉండకూడదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు సెటిలర్లు ఓటు వేయలేదా? అని ప్రశ్నించారు. తన అక్క తప్పుచేసినట్లు నిర్ధారణ కాకముందే ఓ టెర్రిరిస్టును వేధించినట్లు వేధిస్తున్నారని ఆరోపించారు. హఫీజ్ పేట భూముల విలువ పెరిగిందని పోలీసులు ఎలా చెబుతారు అని ఆమె ప్రశ్నించారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ పని కూడా పోలీసులే చేస్తారా అన్నారు. తన సోదరి మాజీమంత్రి అఖిలప్రియకు ప్రాణహాని ఉందని భూమా మౌనిక వాపోయారు.

తమకు ఎక్కడా రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని మౌనిక ప్రశ్నించారు. ఆమెను రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు. అఖిలప్రియ సరిగా భోజనం చేయడం లేదని, ఆమెకు ఆరోగ్యం బాగా లేదని మౌనికి తెలిపారు. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని తప్పుబట్టారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, అఖిలప్రియకు వైద్యం అందించడం లేదని ఆరోపించారు. భూవివాదంపై చర్చించడానికి తాము సిద్ధమని భూమా మౌనిక స్పష్టం చేశారు. ''భూవివాదం మా నాన్న బతికి ఉన్నప్పటి నుంచి ఉంది. మా అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదు. మా అమ్మ శోభా నాగిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తన సోదరిని ఫస్ట్ ఏ2 అని చెప్పి తర్వాత ఏ1గా మార్చారన్నరు. ఏ వీ సుబ్బారెడ్డితో అప్పటికప్పుడు ఏమి సెటిల్ మెంట్ చేసుకున్నారని ప్రశ్నించారు. తాము ఏదో ఫ్యాక్ష్యనిస్టులమైనట్లు చిత్రీకరిస్తున్నారని..మీడియాలో కూడా ఇలా ప్రచారం చేయటం తగదన్నారు. రాజకీయ ఒత్తిళ్ళ వల్లే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it