భవానీపూర్ లో మమతా బెనర్జీ గెలుపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె భవానీపూర్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్ధి ప్రియాంక టిబ్రేవాల్ పై భారీ మెజారిటీతో గెలుపు జెండా ఎగరేశారు. నందిగ్రామ్ లో మమతాను ఓడించిన బిజెపి, ఇక్కడ కూడా ఆమెను ఓడిస్తామని ప్రకటనలు చేసింది. కానీ ఆ పార్టీనే దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మూడవ సారి అధికారాన్ని దక్కించుకున్నా నందిగ్రామ్ లో మాత్రం సువేందు అదికారి చేతిలో మమతా పరాజయం పాలయ్యారు. ఫలితాలు వెల్లడైన రోజు తొలుత మమతానే గెలిచినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ కొన్ని నిమిషాల్లోనే ఇది మారిపోయి ఆమె ఓటమి పాలైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే అయింది.
అయితే దీనిపై కోర్టులో కేసు కూడా నమోదు అయింది. విచారణ సాగుతోంది. మమతా సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్ ఉప ఎన్నికలో విజయం సాధించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న సీఎంకు ఉప ఎన్నిక గెలుపు పెద్ద కష్టం అవుతుందని ఎవరూ అనుకోరు. అయినా కూడా అటు టీఎంసీ, బిజెపి ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాయి. అయితే ఈ ఎన్నికలో మమతా బెనర్జీ 58,389 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్ధిపై విజయం సాధించారు.. దీంతో మమతాకు సీఎంగా కొనసాగటానికి టెన్షన్ లేకుండా పోయింది.