దొంగ గడ్డం అంటూ రాహుల్ వివాదస్పద పోస్ట్
మళ్ళీ రాఫెల్ రగడ మొదలైంది. భారత్ కు రాఫెల్ విమానాల సరఫరాకు సంబంధించి కుదిరిన ఒప్పందంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు రావటంతో ఫ్రాన్స్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని అందిపుచ్చుకుంది. గతంలో ఈ అంశంపై తప్పించుకున్నారని..మరి ఇప్పుడు ఏమి చేస్తారంటూ ప్రశ్నిస్తోంది. అయితే బిజెపి కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతోంది. ఆదివారం నాడు కాంగ్రెస్ నేత రాహుల్ ఓ వివాదస్పద ఫోటోను షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గడ్డానికి రాఫెల్ యుద్ధ విమానాన్ని జోడించి..దొంగ గడ్డం ఇదే అంటూ కామెంట్ జోడించారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో భారత ప్రభుత్వం, ఫ్రెంచ్ విమానాల తయారీదారు డసాల్ట్ ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
దీనిపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసింది. యూపీఏ ప్రభుత్వంలో చర్చించిన ధర కన్నా ఎక్కువ ధరకు ఈ యుద్ధ విమానాలను కొనడానికి మోదీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. 'దొంగ గెడ్డం' ఇదేనంటూ రాహుల్ గాంధీ చేసిన పోస్ట్‌పై బీజేపీ ఐటీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ కూడా అంతే ఘాటుగా స్పందించారు. 2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేశారన్నారు. రాహుల్ ఇప్పుడు ఈ స్థాయికి దిగజారారన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనను తిరస్కరించారన్నారు. ఇదే అంశంపై 2024 ఎన్నికల్లో కూడా పోరాడేందుకు ఆయనకు స్వాగతం చెప్తున్నానని తెలిపారు.