Telugu Gateway
Politics

రాజ‌మౌళికి గుణ‌పాఠం చెప్ప‌టం అంటే ఆయ‌న తండ్రిని రాజ్య‌స‌భ‌కు పంప‌ట‌మా?!

రాజ‌మౌళికి గుణ‌పాఠం చెప్ప‌టం అంటే ఆయ‌న తండ్రిని రాజ్య‌స‌భ‌కు పంప‌ట‌మా?!
X

బండి సంజ‌య్ వార్నింగ్ ఇస్తే..మోడీ రాజ్య‌స‌భ సీటిచ్చారు!

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ‌రం భీమ్ పాత్ర‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం పెద్ద వివాద‌మే చెల‌రేగింది. ఇందులోకి బిజెపి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు..బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజ‌య్ ఇదే అంశంపై అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ‌ట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ లో భీం క్యారెక్టర్ టీజర్ విడుదల చేసిన స‌మ‌యంలో వివాదం త‌లెత్తింది. టీజర్ చివర్లో భీమ్ టకియాను ధరించి కనబడడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చరించాయి. బండి సంజయ్ కూడా రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొమురం భీమ్ కు టోపి పెడితే ఒప్పుకోమని, కొమురం భీం ను కించపరిచే విధంగా, ఆదివాసీల హక్కులను, మనోభావాలను కించపరిచేలా సినిమా తీశావ్.. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు కాల్చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు సంజ‌య్. ఆర్ఆర్ఆర్ సినిమాకు క‌థ అందించింది ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇచ్చిన క‌ల్పిత క‌థ ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ క‌థ విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా క‌మ‌ర్షియ‌ల్ గా సినిమా మాత్రం మంచి విజ‌యం సాధించింది.

మ‌రో బిజెపి ఎంపీ సోయం బాపురావు కూడా రాజ‌మౌళి ఇప్ప‌టికైనా చ‌రిత్ర‌ను తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని..లేదంటే తిప్ప‌లు త‌ప్ప‌వంటూ అప్ప‌ట్లో వార్నింగ్ ఇచ్చారు. విశేషం ఏమిటంటే చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారంటూ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్, ఎంపీ సోయం బాపూరావులు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి వార్నింగ్ ఇస్తే ..ఈ సినిమాకు క‌థ అందించిన ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కు రాష్ట్ర‌ప‌తి కోటా నామినేటెడ్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చింది మోడీ స‌ర్కారు. అంటే అప్పుడు బండి సంజ‌య్, సోయం బాపూరావులు చేసింది త‌ప్పా...లేక ఇప్పుడు మోడీ స‌ర్కారు చేసింది త‌ప్పా?. ఇదే అంశంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌మౌళికి గుణ‌పాఠం చెప్ప‌టం అంటే ఆయ‌న తండ్రికి రాజ్య‌సభ సీటు ఇవ్వ‌ట‌మా అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

Next Story
Share it