Telugu Gateway
Politics

కెసీఆర్ కుట్ర వ్యాఖ్య‌లు..ఈ శ‌తాబ్ద‌పు పెద్ద జోక్

కెసీఆర్ కుట్ర వ్యాఖ్య‌లు..ఈ శ‌తాబ్ద‌పు పెద్ద జోక్
X

తెలంగాణ‌లో భారీ వ‌ర‌ద‌ల‌కు క్లౌడ్ బ‌ర‌స్ట్ ..విదేశీ కుట్ర‌లు కార‌ణం కావ‌చ్చు అంటూ సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. దీనిపై రాష్ట్ర నాయ‌కుల‌తోపాటు జాతీయ స్థాయి నాయ‌కులు కూడా సీఎంపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త కె. చంద్ర‌శేఖ‌ర్ రావు గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల‌కు విదేశీ కుట్ర‌ల‌తో క్లౌడ్ బ‌ర‌స్ట్ కార‌ణం అంటూ తేల్చారంటూ బిజెపి ఐటి సెల్ జాతీయ క‌న్వీన‌ర్ అమిత్ మాల‌వీయ ట్వీట్ చేశారు. మ‌మ‌తా బెన‌ర్జీకి తీవ్ర పోటీ వ‌చ్చింద‌ని అంటూ ఎద్దేవా చేశారు. వీరు పంట‌ల బీమాను అమ‌లు చేయ‌రు...ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను అమ‌లులోకి తీసుకురాకుండా ఇలాంటి కుంటిసాకులు చెబుతారంటూ పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌ అంటూ వ్యాఖ్యానించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. 10వేల ఇళ్ళ‌తో కాలనీ, గోదావరిపై కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ ప్రజలను వంచించే హామీలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ చేసిన తప్పిదాలవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందన్నారు. వరదలపై ప్రజలను దారి మళ్లించేందుకే విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్‌ అని.. ఆయన మాటలను నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కశ్మీర్‌, లేహ్‌ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్‌ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వరద ముంపు ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించి భ‌రోసా ఇవ్వాల్సిన సీఎం జోక‌ర్ ను త‌ల‌పించేలా వ్యాఖ్యానించార‌ని బండి సంజ‌య్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Next Story
Share it