Telugu Gateway
Politics

కెసీఆర్..కెటీఆర్ కారుకు బ్రేకులు వేసిన 'బండి'

కెసీఆర్..కెటీఆర్ కారుకు బ్రేకులు వేసిన బండి
X

సెంచరీ కొడతామని..56 దగ్గర ఆగిన టీఆర్ఎస్

అనూహ్యంగా బిజెపికి 49 సీట్లు

టీఆర్ఎస్ ముందు పెద్ద సవాల్

మేయర్ కోసం ఎంఐఎంతో కలిస్తే బిజెపి నెత్తిన పాలుపోసినట్లే!

ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ పదే పదే సెంచరీ కొడతామని ప్రకటించారు. అంతే కాదు.. బిజెపికి ఓట్లు వేయటానికి ఇది అహ్మదాబాద్ కాదు..హుషార్ హైదరాబాద్, విశ్వనగరమా..విద్వేష నగరమా, గుజరాత్ గులాములా..హైదరాబాద్ గులాబీలా అంటూ రకరకాల నినాదాలను ప్రచారం చేశారు. టీఆర్ఎస్ వస్తేనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యం అవుతుందని..ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు హోరెత్తించారు. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ అయితే బహిరంగ సభలో ఏకంగా తమను గెలిపిస్తే ఏటా హైదరాబాద్ అభివృద్ధికి ఏటా పది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతామని ప్రకటించారు. అంతే కాదు బిజెపి గెలిస్తే కర్ఫ్యూలు మళ్ళీ వస్తాయని..మీకు కర్ఫ్యూ పాస్ లు కావాలా?. రియల్ ఎస్టేట్ పడిపోవాలా?. అభివృద్ధి ఆగిపోతుందని అంటూ హెచ్చరించారు.

కానీ తీరా ఫలితాలు చూస్తే సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ మాటలను హైదరాబాద్ ప్రజలు పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించటం లేదు. గత ఎన్నికల్లో ఏకంగా 99 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఈ సారి ఏకంగా 43 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. బిజెపి అనూహ్యంగా ఈ ఎన్నికల్లో 49 చోట్ల గెలిచి అధికార టీఆర్ఎస్ కు పెద్ద సవాల్ విసిరింది. అంతే కాదు...టీఆర్ఎస్ గెలిచిన సీట్లలో రెండవ స్థానం బిజెపినే నిలవటం ద్వారా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ను ఢీకొట్టబోయేది తామేనని చెప్పకనే చెప్పింది. కెసీఆర్, కెటీఆర్ ల ప్రజాదరణ ముందు చూస్తే బండి సంజయ్ చాలా వెనకబడి ఉంటారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపిని ఓ కీలక శక్తిగా మార్చటంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దే కీలక పాత్ర అని చెప్పకతప్పదు.

బిజెపి జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి వచ్చినా కథ నడిపించటంలో మాత్రం బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. బిజెపికి ఏ మాత్రం సమయం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా చేసుకోవటంలో అధికార పార్టీ సఫలం అయింది. ముందే అభ్యర్ధులను ఖరారు చేసుకుని..అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంతే కాదు..వరసగా నాలుగు రోజులు సెలవులు వచ్చిన తర్వాత బిజెపి ఈ స్థాయిలో సీట్లు దక్కించుకుంది అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అదే షెడ్యూల్ ప్రకారం..సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి ఉంటే బిజెపి ఖచ్చితంగా బల్దియాపై జెండా ఎగరేసి ఉండేది అని చెప్పకతప్పదు. పలు విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ ఫలితాలు ప్రతిభింభించాయి.

Next Story
Share it