రామరాజ్యమా...తాలిబన్ల రాజ్యమా
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రామరాజ్యం కావాలో..తాలిబన్ల రాజ్యం కావాలో తేల్చుకోవాలన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఉత్తమ విద్య, వైద్యం ఉచితంగా అందించే ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని సంజయ్ ప్రకటించారు. ధరణి కేసీఆర్ భరణిగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం భూములిస్తే.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా వాళ్ల బతుకులు ఆగం చేశారని మండిపడ్డారు. యాత్రలో అడుగడుగునా ప్రజలు తమ కష్టాలు, బాధలు చెప్పుకుంటున్నరని చెప్పారు. ప్రాజెక్టులు కట్టినం అని చెప్పుకుంటున్నారు... ఒక్క చుక్క నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులంటూ లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. సర్పంచులకు నిధులు లేవని, ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోడానికే ఈ యాత్ర అని చెప్పారు. 2023లో గడీల పాలన బద్దలు కొట్టి.. ప్రజా పాలన తీసుకోస్తామన్నారు.
80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతత్వమా ?, తాలిబన్ల రాజ్యం తెస్తామన్న ఎంఐఎం పాలన కావాలా ?, రామ రాజ్యం తెస్తామన్న బీజేపీ కావాలా? అని ప్రశ్నించారు. బైంసాలో మరోసారి కలహాలు సృష్టిస్తే అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఒక వర్గానికి, పార్టీకి కొమ్ము కాసే చర్యలు బీజేపీ సహించదన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర భవిష్యత్ లోనూ కొనసాగుతుందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేల రూపాయల భృతి ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న కెసీఆర్ ఖాళీలు మాత్రం భర్తీ చేయటంలేదన్నారు. ఎంఐఎంకు భయపడుతూ టీఆర్ఎస్ పాలన సాగిస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని తెలిపారు. పేదలకు హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ళనుఉ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.