Telugu Gateway
Politics

ఉద్యోగాలు భ‌ర్తీచేసేదాకా ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌బోమ‌ని హామీ ఇవ్వాలి

ఉద్యోగాలు భ‌ర్తీచేసేదాకా ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌బోమ‌ని హామీ ఇవ్వాలి
X

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా ప్ర‌క‌టించిన ఉద్యోగాలు భ‌ర్తీ చేసే వ‌ర‌కూ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోమ‌ని హామీ ఇవ్వాల‌న్నారు. కోర్టు కేసు సాకులతో ఉద్యోగాల భర్తీ వాయిదా వేస్తే వదిలిపెట్టబోమని హెచ్చ‌రించారు. సీఎం కెసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై బండి సంజ‌య్ బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ మండిప‌డ్డారు. నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా స్పందించని కేసీఆర్... తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఈరోజు 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిండు. ఉద్యోగాల భర్తీ కోసం గత 8 ఏండ్లుగా నిరుద్యోగ తమ్ముళ్లు, చెల్లెళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిండ్రు. నీ మోసపూరిత ప్రకటనలు విని విని ఇక ఉద్యోగాలు రావని విసుగుపుట్టి వందలమంది సూసైడ్ చేసుకుని చనిపోయిండ్రు. ఇన్నాళ్లకైనా నీ మనసు కరిగింది. సంతోషం. ఈ ఉద్యోగాల ప్రకటన బీజేపీ సాధించిన విజయం. ఉద్యోగాల భర్తీ కోసం అనేక పోరాటాలు చేసినం. లాఠీ దెబ్బలు తిన్నం. అరెస్టైనం. జైలుకు పోయినం. అయినా బాధపడలే. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయకుంటే నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్ లో 'మిలియన్ మార్చ్' నిర్వహిస్తామని ప్రకటించినం. మిలియన్ మార్చ్ ఏర్పాట్లు దాదాపు పూర్తయినయ్. లక్షలాదిగా నిరుద్యోగ యువకులు హైదరాబాద్ రావడానికి సిద్ధమైనరు.

ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కు వెన్నులో వణుకుపుట్టింది. ఇప్పుడు కూడా ఉద్యోగాల ప్రకటన చేయకపోతే యువతీ యువకులు భరతం పడతరని ఆయనకు అర్ధమైంది. అట్లాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినయ్. ఈ రెండిటి దెబ్బతో ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేసిండు. చాలా అందంగా నిరుద్యోగ యువతీ యువకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసిండు. 8 ఏండ్లుగా వందలాది మంది యువకులను బలి తీసుకున్న కేసీఆర్... ఈ ప్రకటనతో లక్షలాది మంది జీవితాలు బంగారు మయం అవుతున్నట్లు ఫోజులు కొట్టిండు అంటూ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఉద్యోగాలిస్తనని నువ్వు చేసిన డ్రామాల్లాగే ఇది కూడా చెయ్యకు. ఉద్యోగ కేలండర్ ఇస్తానంటున్నవ్ కదా... అందులో ఎగ్జామ్, రిజల్ట్, రిక్రూట్ మెంట్, పోస్టింగ్ డేట్స్ తో సహా కేలండర్ ఇయ్. ఎందుకంటే నువ్వు పెద్ద మోసగాడివి. గ్రూప్-2 ఉద్యోగాలు ప్రకటించి వాటిని భర్తీ చేయడానికి మూడేళ్లు పట్టింది. 2017-18లో ఫార్మాసిస్ట్ ల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజల్ట్ లేదు.. అలాట్ మెంట్ లేదు. నాలుగేళ్ల నుండి నీకు సోయెందుకు లేదు? అంటూ మండిప‌డ్డారు.

Next Story
Share it