సర్కార్ దిగొచ్చేలా 'నిరుద్యోగ దీక్ష'
తెలంగాణలో రాజకీయ పార్టీలన్నింటికీ నిరుద్యోగ సమస్యే ఏజెండా కావాలని బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 27న ఇందిరా పార్కు వద్ద చేయనున్న దీక్షను విజయవంతం చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల రీఅలాట్ మెంట్, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా సర్కార్ ను నిలదీయనున్నట్లు పేర్కొన్నారు. సంజయ్ శనివారం నాడు నిరుద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. జోనల్ కేటాయింపుల్లో భాగంగా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపైనా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా ఈ దీక్షా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల విద్యార్థి, యువజన, ఉద్యోగ, నిరుద్యోగ, ప్రజా సంఘాల నాయకులంతా రాజకీయాలకు అతీతంగా 'నిరుద్యోగ దీక్ష'కు తరలివచ్చి సంఘీభావం తెలపాలని కోరారు. 'కేసీఆర్ పాలనలో ఉద్యోగాల్లేక నిరుద్యోగ యువత ఎన్నో ఇబ్బందులు పడుతోంది. తినడానికి తిండిలేక కోచింగ్ తీసుకోవడానికి డబ్బుల్లేక నానా కష్టాలు పడుతున్న విషయం నేను కళ్లారా చూశాను.
నా పాదయాత్రలో నిరుద్యోగులు ఎక్కడికక్కడ తరలి వచ్చి బాధలు చెప్పుకుంటుంటే గుండె తరుక్కుపోయింది. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధేస్తోంది. ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే...ఈనాడు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఇకనైనా ఆత్మహత్యలు ఆగాలి. నిరుద్యోగులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈనెల 27న 'నిరుద్యోగ దీక్ష' చేపడుతున్నం.'అని తెలిపారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయం. బీజేపీతో టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఎసరొచ్చే ప్రమాదముందని భయపడుతున్నడు. అందుకే నిరుద్యోగ సమస్యను దారి మళ్లించేందుకు కొత్త సమస్యను లేవదీశాడు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై లేనిపోని రాద్దాంతం చేస్తున్నడు. కేసీఆర్ ట్రాప్ లో పడొద్దు. ఇప్పుడు కేసీఆర్ కు నిరుద్యోగుల సత్తా ఏందో చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇఫ్పుడుగాకుంటే కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం నోటిఫికేషన్లు వెలువడే అవకాశమే ఉండదు. నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రభుత్వం మెడలు వంచి నోటిఫికేషన్లు వెలువరించేలా ఉద్యమిద్దాం.'అని పేర్కొన్నారు.