కెసీఆర్ కు బండి సంజయ్ లేఖ
ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ మంగళవారం నాడు సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన ప్రధానంగా నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. '63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మిగిలిన 63,425 పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు? . ఆ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. 80,039 పోస్టులకు ఉద్యోగ నియామకాలు చేపడతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి 45 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కేవలం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా వున్న పోస్టులు భర్తీ చేసేవరకు బిజెపి పార్టీ ఉద్యమిస్తుంది . ఉద్యోగ ఖాళీల భర్తీపై విద్యావంతులైన నిరుద్యోగ యువత చేసే ఉద్యమాలకు బిజెపి అండగా వుంటుంది . ఉద్యోగాల భర్తీ నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలో 1 లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్రప్రభుత్వం కేవలం 80 వేల పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఎప్పటి నుండి విధుల్లోకి తీసుకుంటారు?. టెట్ నిర్వహణలో టీఆర్‌ఎస్ ప్రభత్వం అలసత్వం వల్ల నిరుద్యోగులు బలికావాల్సి వస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో రాష్ట్రప్రభుత్వం పోటీ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి' అని డిమాండ్ చేశారు.