Telugu Gateway
Politics

కేసీఆర్....నీ పాపాలే టీఆర్ఎస్ పాలిట యమపాశాలు

కేసీఆర్....నీ పాపాలే టీఆర్ఎస్ పాలిట యమపాశాలు
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కెసీఆర్ పాపాలే..టీఆర్ఎస్ పాలిట య‌మ‌పాశాలుగా మార‌బోతున్నాయ‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల, రైతుల ఉసురు తగలడం ఖాయం అన్నారు. కెసీఆర్ ను గద్దె దించేదాకా విశ్రమించే ప్రసక్తే లేద‌న్నారు. నీలాంటి నియంత-కుటుంబ-అవినీతి పాలనను అంతం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు. జనం మార్పు కోరుకుంటున్నర‌ని, బీజేపీవైపు చూస్తున్నార‌ని తెలిపారు. కేసీఆర్ రెచ్చగొట్టినా తగ్గేదేలే అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపును అడ్డుకోవడం అసాధ్యం అని పేర్కొన్నారు. మేడ్చల్, రంగారెడ్డి రూరల్ జిల్లాల శిక్షణా సమావేశాల్లో బండి సంజయ్ మాట్లాడారు. ''కేసీఆర్..... నీ మూర్ఖపు పాలనవల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు గోసపడుతున్నరు. ఆత్మహత్య చేసుకుంటున్నరు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చివరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితి నీ పాలనలో ఉంది.

నీ సుపుత్రుడి బినామీ సంస్థ నిర్వాకంవల్ల ఆనాడు 27 మంది ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నరు. మీ చేతగానితనంవల్ల ఈరోజు 4గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. వాళ్ల ఉసురు నీకు తగలక మానదు. నీవు చేసిన పాపాలే శాపాలై టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో యమపాశాలుగా మారబోతున్నయ్. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించబోమ‌న్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కార్పొరేట్ విద్యా సంస్థల వద్ద డబ్బు దండుకుని టెన్త్ లో అందరినీ పాస్ చేసి చేతులు దులుపుకున్నరు. ఈరోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. రైతులు, నిరుద్యోగులు, అప్పుల బాధితులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

మానవత్వం లేని మనిషి సీఎం కేసీఆర్. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు రోడ్డున పడ్డరు. 317 జీవోవల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని స్థితి ఏర్పడింది. వాళ్ల ఉసురు ఊరికే పోదు. కేసీఆర్ చేసిన పాపాలే శాపాలై రాబోయే ఎన్నికల్లో యమ పాశాలుగా మారబోతున్నయన్నారు. ఈ సమస్యను దారి మళ్లించడానికి టీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోళ్ల పేరుతో ఢిల్లీలో డ్రామా చేస్తుండ్రు. నరుకుతాం...ముక్కలు చేస్తాం...రండ అనే మాటలు మాట్లాడుతుండు. రేపటి నుండి కేసీఆర్ మనల్ని ఉరికిస్తడట. భయపడతమా? బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వ ణుకుతుండు. కేసీఆర్...నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను గద్దె దించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు. కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడినా ఉద్యోగాల భర్తీ చేసేదాకా ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయబోతున్నామ‌ని తెలిపారు.

Next Story
Share it