ఉద్యమకారులవి త్యాగాలు..కెసీఆర్ ఫ్యామిలీవి భోగాలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి మరింత రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశను జోగుళాంబ ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించే సమయం వచ్చిందదని వ్యాఖ్యానించారు. అంతకు ముందు బండి సంజయ్ కు తెలంగాణ మంత్రి కెటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలపై కూడా సంజయ్ స్పందించారు. ఉద్యమ కారుల త్యాగాలతో తెలంగాణ వస్తే కెసీఆర్ ఫ్యామిలీ భోగాలు అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేసింది కెసీఆరే అని ఎద్దేవా చేశారు సంజయ్. కరువుతో, వలసలతో ఎండిన పాలమూరు కేసీఆర్ కు పచ్చగా కన్పిస్తోందట. ప్రజలారా.... కేసీఆర్ కు పొగ పెట్టి గద్దె దించితేనే పాలమూరు అభివ్రుద్ధి సాధ్యం. ఆర్డీఎస్ సమస్య పరిష్కారమవుతుంది''అని అన్నారు. 'ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను గల్లా పట్టి ప్రగతి భవన్ కు, అక్కడి నుండి ధర్నా చౌక్ కు, జిల్లాలకు, దేశ రాజధానికి తిప్పిన ఘనత బీజేపీదే.
బీజేపీని ఓడించడానికి కేసీఆర్ తెలంగాణ ప్రజలను పీడించి దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాల నేతలకు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఆర్డీఎస్ నీళ్లు పారిస్తానన్న కేసీఆర్ ఏమైంది? పచ్చగా ఉన్న పాలమూరులో నేను చిచ్చు పెడుతున్నాననట. పాలమూరు పచ్చగా ఉందా? ఎండిపోయిన జిల్లా ఇది. వలసల జిల్లా ఇది. కానీ కేసీఆర్ కు పాలమూరు పచ్చగా కన్పిస్తుందట... నేను పచ్చని పాలమూరులో చిచ్చు పెడుతున్నానట..ఆర్డీఎస్ గురించి మాట్లాడే దమ్ముందా కేసీఆర్ కు... కేసీఆర్ కు పొగ పెడితేనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమైతది. పాలమూరు పచ్చగ కావాలంటే... కేసీఆర్ కు ప్రజలు సెగ తగిలించాల్సిందే. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు... పైసలు పడేస్తే ప్రజలు ఓట్లేస్తారనే చులకన భావం కేసీఆర్ కు ఉంది. హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పైసలిచ్చి గెలవాలని చూస్తే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రజలు తీర్పిచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. కేంద్రం 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఘనుడు. కేసీఆర్... కేంద్రం మంజూరు చేసిన లక్షా 40 వేల ఇండ్లు కట్టిస్తే... మరో లక్ష ఇండ్లు కేంద్రం ద్వారా మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇంటికో ఉద్యోగమన్నావ్... నిరుద్యోగ భ్రుతి ఇస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్. ఉద్యోగం ఇవ్వకపోతే నీ సంగతి చూస్తామని బీజేపీ హెచ్చరిస్తే... దిగొచ్చి నోటిఫికేషన్లు ఇస్తామంటూ దిగొచ్చిన నాయకుడు కేసీఆర్.
టీఆర్ఎస్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కేసీఆర్ ఫాలనలో వైద్యం పడకేసింది. అలంపూర్ ప్రజలకు అనారోగ్యమొస్తే ఏపీకి వెళ్లాల్సిన దుస్థితి. ఎన్నికలొస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి మళ్లీ ఓట్లు దండుకోవాలన్నదే కేసీఆర్ ప్లాన్. కానీ జనం కేసీఆర్ ను నమ్మడం లేదు. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడంతో రగలిపోతున్నరు.ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ కు వాతపెట్టాలని కాచుకుని కూర్చుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాసి కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తాడంట. కల్వకుంట్ల కుటుంబం చెప్పిందే శాసనం కావాలట. పేదోళ్లు పేదోళ్లుగానే ఉండాలట. దళితులంటే నచ్చదట. కేసీఆర్ కుటుంబానికే పదవులు కావాలట. ఆయనకు సీఎం, కొడుకుకు మంత్రి పదవి, బిడ్డకు ఎమ్మెల్సీ, అల్లుడికి మంత్రి పదవి, సడ్డకుడి కొడుకుకు ఎంపీ పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్షలు చేసిన చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణ కోసం యువకులు బలిదానాలు చేసుకుంటే వారి త్యాగాలతో టీఆర్ఎస్ భోగాలను అనుభవిస్తోంది. ఇఫ్పటి వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలి. తెలంగాణ అభివ్రుద్ధి చేసి చూపిస్తా.' అని వ్యాఖ్యానించారు.