Top
Telugu Gateway

తెలంగాణలో రెండు రకాల అవినీతి

తెలంగాణలో రెండు రకాల అవినీతి
X

అనుకూల అవినీతి..వ్యతిరేకుల అవినీతి

మంత్రులు..ఎమ్మెల్యేల కబ్జాల సంగతి ఏంటి?

విచారణకు పక్క రాష్ట్రాల ఐఏఎస్ లు కూడా చాలరు

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కెసీఆర్ తన అనుకూలురు అవినీతి చేస్తే ఏమీ అనరు అని..కానీ తన వ్యతిరేకుల అవినీతిపై మాత్రం చర్యలు తీసుకుంటారన్నారు బండి సంజయ్. మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై ఇంత ఆగమేఘాల మీద స్పందించిన కెసీఆర్, తన ప్రభుత్వంలోని మంత్రులు..ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు బినామీలతో వందల ఎకరాల భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఒక్క మంత్రిపై చర్యలు తీసుకోగానే కెసీఆర్ ది నీతివంతమైన పాలన అయిపోదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం 70 మంది పై భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయని..ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని వ్యాఖ్యానించారు.

మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ముత్తిరెడ్డి..ఇలా జాబితా చెబుతూ పోతే చాలా ఉందన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆస్తులపై విచారణ జరిపించాలన్నారు. వీరి అక్రమాలు..కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలను ప్రజల ముందు పెడతామని..న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. బండి సంజయ్ శనివారం నాడు ఎంపీ ధర్మపురి అరవింద్ తోపాటు మరికొంత మందితో కలసి మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటే..అసలు ముఖ్యమంత్రి ఇంత వరకూ కరోనాపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు. ప్రజలను వ్యాక్సిన్ వేయించుంకోవాలని ఒక్కసారి కూడా ఎందుకు పిలుపు ఇవ్వలేదని..ఇది సీఎం బాధ్యత కాదా అని ప్రశ్నించారు.

సీఎం కెసీఆర్ కూడా ఇఫ్పటివరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని..ప్రజలకు ఏమి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముందు మాస్క్ లు అక్కర్లేదు..పారాసిటమాలు చాలు అని ప్రకటనలు చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిస్థితి గందరగోళంగా ఉందని అన్నారు. కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు అని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయమంటే.. ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి చేతులు దులుపేసుకున్నారని తెలిపారు. కార్పొరేట్‌ ఆస్పత్రులంటే పేదలు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖలో ఎక్కువ డబ్బులుంటే.. కేసీఆర్‌ ఆ శాఖ తీసుకుంటారు అని చెప్పారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అని కొట్టిపారేశారు.

Next Story
Share it