Telugu Gateway
Politics

కెసీఆర్ దొంగ దీక్షను ఎవ‌రూ న‌మ్మ‌రు

కెసీఆర్ దొంగ దీక్షను ఎవ‌రూ న‌మ్మ‌రు
X

టీఆర్ఎస్ వ‌ర్సెస్ బిజెపి. అధికార టీఆర్ఎస్ సోమ‌వారం నాడు ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నా చేస్తే ..బిజెపి హైద‌రాబాద్ లో అదే డిమాండ్ తో ధ‌ర్నాకు దిగింది. అదే స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు రాజకీయంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ సంజ‌య్ ఢిల్లీలో కెసీఆర్ చేసిన దొంగ దీక్షను ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏమి చేయ‌లేకే ఢిల్లీ వెళ్ళి నాట‌కాలు వేస్తున్నార‌ని ఆరోపించారు. వ‌డ్లు కొను..లేక‌పోతే గ‌ద్దెదిగు అనే నినాదంతో బిజెపి కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. వడ్లు కొనకుంటే కేసీఆర్ గద్దె దిగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ అన్నారు. కేసీఆర్‌కు వయసు మీద పడి సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లుల నుంచి..డైవర్ట్ చేసేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. కమీషన్లకు టీఆర్ఎస్ నేతలు బాగా రుచి మరిగారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక పాస్‌ పోర్ట్ బ్రోకర్ అని ఆరోపించారు. పత్తి, మిర్చి ధర పెరగడానికి కారణం కేంద్రమేనని తెలిపారు. రైతు సమన్వయ సమితులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసేవాళ్లకు.. సమన్వయ సమితుల బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. ఇసుక, పాస్‌పోర్ట్ దందాలు చేశారని , ఇప్పుడు బియ్యం దందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ధ‌నిక రాష్ట్రం గ‌ప్పాలు కొట్టే ముఖ్య‌మంత్రి ఎందుకు జీతాలు ఆల‌శ్యంగా ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు రాష్ట్రాన్నిఅప్పులు పాలు చేసి..జీతాలు కూడా ఇవ్వ‌లేని స్థితికి తెచ్చార‌న్నారు. లేని స‌మ‌స్య‌ను తెర‌పైకి తెచ్చి కెసీఆర్ రాజ‌కీయం చేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.

Next Story
Share it