ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి మెత్తబడ్డారు. సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత ఆయన తనకు సీఎం పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారని..ఆయన ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్నారు. మంత్రి పదవి రానందుకు అనుచరుల్లో కొంత అసమ్మతి వచ్చిందని..అయినా సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మంత్రి పదవులు కేటాయించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పార్టీ మార్పు ప్రచారం మాత్రమేనన్నారు. మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
వైఎస్ కుటుంబంతో తాము సన్నిహితులమని బాలినేని తెలిపారు. పలుమార్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తో జరిపిన చర్చలు ఫలించకపోవటంతో చివరకు సీఎం జగన్ దగ్గరే సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత ఆయన అసమ్మతి ఎగిరిపోయింది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే రాజీనామా చేసిన నేతలు అందరూ తమ రాజీనామాలు ఉపసంహరించుకుంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని..అప్పుడు మళ్లీ తనకు మంత్రి పదవి వస్తుందన్నారు.