బద్వేలు ఉప ఎన్నికపై జనసేన, బిజెపి చెరోదారి
రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మంచి అయినా..చెడు అయినా కలిసే నడుస్తాయి. లేదు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే పొత్తు పెటాకులవుతుంది. పొత్తు నుంచి బయటకు వచ్చి ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ ఏపీలో బిజెపి, జనసేన పొత్తు వ్యవహారం విచిత్రంగా ఉంది. మొదటి నుంచి ఇదే తంతు. అమరావతికి మద్దతు ఇచ్చినందుకే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ దిశగా జరిగింది ఏమీ లేదు. అదేమంటే పార్టీ వేరు..ప్రభుత్వం వేరు అనే సూత్రీకరణలు తెరపైకి తెస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిజంగా అలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందా?. అంటే వాస్తవం ఏంటో అందరికి తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో హ్యాండిచ్చిన బిజెపి ప్యాకేజీ ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్లు అన్న పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సరేన కారణం లేకుండానే మళ్ళీ బిజెపితో కలిశారు. వీరిద్దరూ కలిసి ఏపీకి చేసిన ఒక్క మేలు అంటే ఒక్కటి ఉంది అంటే ఏమీ లేదనే ఖచ్చితంగా చెప్పొచ్చు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా ఏమీ చేయలేదు. అధికార వైసీపీ కూడా ఏమీ చేయలేకపోతుంది.
మరి రాజకీయ ప్రయోజనాలు ఆశించే పార్టీలు అయిన బిజెపి, జనసేనలు పొత్తు ద్వారా సాధిస్తున్నది ఏమిటి?. మళ్లీ ఇప్పుడు కొత్త ట్విస్ట్. కడప బద్వేలులో గెలుపు ఎవరిదో ఊహించటం పెద్ద కష్టం కాదు. అయినా సరే పొత్తు పెట్టుకున్న పార్టీలు రెండు ఈ ఉప ఎన్నిక విషయంలో చెరోదారి వెళ్లటం ద్వారా క్యాడర్ కు ఏమి సంకేతం పంపుతున్నట్లు?. బద్వేలు లో చనిపోయిన అభ్యర్ధి కుటుంబ సభ్యులే నిలబడుతున్నందున తాము బరిలో ఉండబోమని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. మరుసటి రోజు అంటే ఆదివారం నాడు ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు మాత్రం వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని..బద్వేలు ఉప ఎన్నికను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ప్రకటించారు. అంటే పవన్ ది ఓ దారి..సోము వీర్రాజుది మరోదారి. మళ్ళీ వీరిద్దిరి పార్టీల మధ్య పొత్తు. ప్రధాని మోడీ ఏడేళ్ళుగా రాష్ట్రానికి నిధులు ఇచ్చి డెవలప్ చేస్తున్నారని..ఈ అంశంపై చర్చకు జగన్, చంద్రబాబులు సిద్ధమా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. బద్వేలు పరిణామాలు చూస్తుంటే మరోసారి బిజెపి, జనసేన పొత్తు ఫట్ మనేలా కన్పిస్తోంది.