అధిష్టానం మాట వింటా...యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా అనివార్యంగా కన్పిస్తోంది. గురువారం నాడు ఆయనే దీన్ని నిర్ధారించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని..ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు కన్పిస్తోంది. ఈ నెల26తో యడ్యూరప్ప సీఎం అయి రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. వాస్తవానికి ఈ నెల 25న ఎమ్మెల్యేలకు ఆయన విందు ఏర్పాటు చేశారు. దీన్ని కూడా రద్దు చేసుకున్నారు. అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. పార్టీలో 75 సంవత్సరాలు దాటిన వారికి పదవులు ఇవ్వలేదని, కానీ 78 సంవత్సరాల వయసు పైబడినా తనకు అవకాశం ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ నెల 26న ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని...ఆ రోజు తమ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని తెలిపారు.
ప్రధాని మోడీ, అమిత్ షా, జె పీ నడ్డాలకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మఠాధిపతులు అందరూ సీఎం యడ్యూరప్పను మార్చొద్దని..మారిస్తే మాత్రం ఢిల్లీలో దర్నా చేస్తామన్నట్లు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కర్ణాటక రాజకీయాలపై బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యడ్యూరప్పను మారిస్తే కర్ణాటకలో బీజేపీకి కష్టమేనని ట్వీట్ చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశం దేశమంతటా చర్చకు తెరలేవగా సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన తొలి వ్యక్తి యడియూరప్ప అన్నారు. ఆయన సత్తా కలిగిన నేత అని పేర్కొన్నారు. ఆయన లేనందుకే 2013లో అధికారం దక్కలేదని మరోసారి అదే తప్పిదం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.