విజయసాయిరెడ్డిపై అయ్యన్న వివాదస్పద ట్వీట్
ఏపీ రాజకీయాల్లో ఎంత రచ్చ జరుగుతున్నా నేతలు మాత్రం మారటం లేదు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురువారం నాడు వివాదస్పద ట్వీట్ చేశారు. అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సాయిరెడ్డిని ఎక్కడికో తీసుకెళ్లాలని వైఎస్ జగన్ అనుకుంటున్నాడు. ఎక్కడికి అంటే, ఉదాహరణకి బాబాయ్‌ని వేసేసిన బాత్రూమ్ వద్దకు అనుకోండి. అక్కడికి సాయిరెడ్డి రాడు. బాబాయ్ గొడ్డలివేటు స్కీంకి ఎటువంటి సిఫారసులు లేకుండా సాయిరెడ్డి ఎందుకు ఎంపికయ్యాడంటే, జగన్‌రెడ్డి సోదరుడు అనిల్‌రెడ్డి మద్యం మాఫియా కోసమే తాలిబన్ల నుంచి హెరాయిన్ తెప్పించాడని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సాయిరెడ్డి ఉప్పందించినందుకు.
అప్పటి నుంచి విసారెడ్డి విశాఖలో కనిపించడు. ఢిల్లీ పెద్దల బంగళాల్లో దాక్కుంటూ, జగన్‌రెడ్డి గొడ్డలి వేటుకి దొరక్కుండా విదేశాలు పారిపోయేందుకు వీసా కావాలని కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నాడు. పాపం నాడు వివేకాకి గొడ్డలితో గుండెపోటు తెప్పించినట్టే, సాయన్నకి వచ్చే అవకాశాలున్నాయని తాడేపల్లి అభిజ్ఞవర్గాల భోగట్టా. ' వరస ట్వీట్లు చేశారు. గతంలో సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.