Telugu Gateway
Politics

దేవినేని ఉమా కారుపై రాళ్ళ దాడి

దేవినేని ఉమా కారుపై రాళ్ళ దాడి
X

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కారుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ వ్య‌వ‌హ‌రం ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. ఈ దాడిలో ఆయ‌న కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అక్ర‌మ మైనింగ్ ను పరిశీలించేందుకు ఉమా వెళ్లారు. జి.కొండూరు మండలంలో రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు చేరుకోవ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఎమ్మెల్యే వ‌సంత క్రిష్ణ ప్ర‌సాద్ అనుచ‌రులే దాడికి పాల్ప‌డ్డార‌ని ఉమా ఆరోపించారు. ఆందోళ‌న కారుల నుంచి ఉమా వాహ‌నాన్ని పోలీసులు తప్పించారు.

అయితే పోలీసులు స‌రైన రీతిలో భ‌ద్ర‌త క‌ల్పించ‌లేదంటూ ఉమా జి కొండూరు పోలీస్ ద‌గ్గ‌ర ఆందోళ‌న‌కు దిగారు. ఉమాపై దాడిని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ గూండాల దాడి ఏ మాత్రం స‌రికాద‌న్నారు. వైసీపీ అవినీతి, అక్ర‌మాల‌ను అడ్డుకున్నందుకే ఇలా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత క్రిష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ పై ఉమా అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకే ఆయ‌న‌పై దాడి జ‌రిగింద‌ని అన్నారు.

Next Story
Share it