Telugu Gateway
Politics

ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ వాహ‌నంపై దాడి

ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ వాహ‌నంపై దాడి
X

బిజెపి నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ వాహ‌నంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయ‌న కారు అద్దాలు ప‌గిలాయి. ఈ ఘ‌ట‌న‌తో బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌టంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. నందిపేట్ మండ‌లం నూత్ ప‌ల్లి వ‌ద్ద ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఎంపీ అర‌వింద్ వ‌స్తున్నార‌ని స‌మాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఈ దాడికి దిగారు. పోలీసులు తీరును త‌ప్పుప‌డుతూ ఆర్మూర్ లో బిజెపి కార్య‌క‌ర్త‌లు రాస్తారోకోకు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ మండిప‌డ్డారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లే ఈ ప‌ని చేశార‌ని..200 మంది వ‌చ్చి త‌మ వాహ‌నాల‌కు అడ్డం ప‌డ్డార‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై తాను లోక్ స‌భ ప్రివిలైజ్ క‌మిటీకి పిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏసీపీతోపాటు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన వారు ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని..తాము ప‌దే ప‌దే ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టంలేద‌న్నారు.

మంగ‌ళ‌వారం నాటి ఘ‌ట‌న‌తో మ‌రోసారి ఈ విష‌యం రుజువైంద‌న్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ దాడికి త‌మకు ఎలాంటి సంబంధం లేదని..ఇది ప‌సుపు బోర్డు హామీ అమ‌లులో విఫ‌ల‌మైన ఎంపీపై రైతులు చేసిన దాడిగా టీఆర్ఎస్ చెబుతోంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి దీనిపై స్పందించారు. ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదు..పసుపు రైతులే అన్నారు. రైతులకు సమాధానం చెప్పలేకనే మామిడిపల్లి నడిరోడ్డుపై నాటకాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. టీఆర్ఎస్ ను విమర్శించేముందు ఎంపీ అరవింద్ రైతులకు సమాధానం చెప్పాల‌న్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని చెప్పావా?లేదా?, పసుపుబోర్డు తేలేకపోతే రాజీనామా చేసి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని బాండ్ పేపర్ రాసిచ్చావా?లేదా? అని ప్ర‌శ్నించారు. పసుపుబోర్డు తేకుండా అరవింద్ ఏ గ్రామంలో అడుగుపెట్టలేడని హెచ్చ‌రించారు.

Next Story
Share it