Telugu Gateway
Politics

అధ్యక్షుడు అవ్వ‌క ముందే అధిష్టానానికి అశోక్ గెహ్ల‌ట్ ఝ‌ల‌క్!

అధ్యక్షుడు అవ్వ‌క ముందే అధిష్టానానికి అశోక్ గెహ్ల‌ట్ ఝ‌ల‌క్!
X

కాంగ్రెస్ అధిష్టానానికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ఓ రేంజ్ లో ఝ‌ల‌క్ ఇచ్చారు. సోనియాగాంధీ ఆయ‌న్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యించింది. అదే స‌మ‌యంలో పార్టీ విధాన నిర్ణ‌యం ప్ర‌కారం ఒకే ప‌ద‌వి ఉండాల‌నే ష‌ర‌తుతో ఆయ‌న్ను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించి .రాహుల్ స‌న్నిహితుడు.యువ నేత స‌చిన్ పైల‌ట్ కు సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని ప్ర‌తిపాదించారు. అయితే స‌చిన్ పైల‌ట్ కు సీఎం ప‌ద‌వి అప్ప‌గించ‌టం అశోక్ గెహ్లాట్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయ‌న త‌న స‌న్నిహితులు అయిన వారి పేర్ల‌ను స‌చిన్ పైల‌ట్ కు ప్ర‌త్యామ్నాయ ప్ర‌తిపాద‌న‌లుగా తెర‌పైకి తెచ్చారు. అక్క‌డితో ఇది ఆగ‌లేదు. అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు నిర్వ‌హించాల్సిన సీఎల్పీ భేటీకి ముందే అశోక్ గెహ్లాట్ వ‌ర్గం ఎమ్మెల్యేలు 92 మంది ఏకంగా త‌మ ప‌ద‌వులకు రాజీనామా పత్రాల‌తో స్పీక‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. స‌చిన్ పైల‌ట్ గ‌తంలో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని..అలాంటి వ్య‌క్తికి సీఎం ప‌ద‌వి ఎలా ఇస్తార‌న్న‌ది అశోక్ గెహ్లాట్ వ‌ర్గీయుల వాద‌న‌. కానీ అధిష్టానం మాత్రం యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ వైపే మొగ్గుచూపుతోంది. అధిష్టానం ప్ర‌తినిధిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ప‌ద‌వికి నామినేష‌న్ వేయ‌నున్న వ్య‌క్తి..సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ గెహ్లాట్ వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌డు ఎంత బ‌ల‌హీనంగా ఉందో తెలియ‌జేస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని సోనియా సూచించిన స‌మ‌యంలో ఆయన రాజ‌స్థాన్ సీఎంగా కూడా కొన‌సాగేందుకు అనుమ‌తించాల‌ని కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం దీనికి నో చెప్పటంతో ఇప్పుడు ఈ ట్విస్ట్ ఇచ్చార‌ని భావిస్తున్నారు. తాజాగా రాజ‌స్థాన్ లో త‌లెత్తిన స‌మ‌స్య‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎలా ప‌రిష్క‌రిస్తుంది అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీకి అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా పేరున్న అశోక్ గెహ్లాట్ తాజాగా ఇచ్చిన ఝ‌ల‌క్ అధిష్టానంతోపాటు కాంగ్రెస్ నేత‌ల‌ను కూడా షాక్ కు గురిచేసింద‌నే చ‌ర్చ సాగుతోంది. దేశంలో బిజెపిని ఓడించేందుకు మూడ‌వ ఫ్రంట్ కాదు..కాంగ్రెస్ సార‌ధ్యంలోనే పార్టీలు అన్నీక‌ల‌సి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కీల‌క నేత‌లు వ్యాఖ్యానిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీలో త‌లెత్తిన ఈ రాజ‌స్థాన్ నాయ‌క‌త్వ స‌మ‌స్య ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో అన్న టెన్ష‌న్ పార్టీ నేత‌ల్లో ఉంది.

Next Story
Share it